హైదరాబాద్: భవిష్యత్తు మొత్తం విద్యుత్ వాహనాల వాడకం తప్పనిసరి అవుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. విద్యుత్ వాహనాల వాడకంలో ఎటువంటి అపోహలు వద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విద్యుత్ వాహనాల వినియోగంతో పర్యావరణ పరిరక్షణతో పాటు వినియోగదారులకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని ఆయన చెప్పారు.
టీఎస్ రెడ్కో ఆధ్వర్యంలో నగరంలోని నెక్లెస్ రోడ్లో విద్యుత్ వాహనాల ప్రదర్శనను మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం విద్యుత్‌తో నడిచే వాహనాలను మంత్రి జగదీష్ రెడ్డి స్వయంగా నడిపించి ప్రదర్శనలో పాల్గొన్న వారిని ఆకర్షించారు. టీఎస్ రెడ్కో వీసీ, ఎండీ జానయ్య అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఇంధన శాఖ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సునీల్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ప్రదర్శన అనంతరం.. మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణం ప్రపంచానికి సవాల్ విసురుతున్న నేపధ్యంలో విద్యుత్ వాహనాలు వాడకంలోకి రావడాన్ని అందరూ స్వాగతించాలన్నారు.
మనం సృష్టిస్తున్న సమస్యల వల్లనే పర్యావరణ సమస్య ఉత్పన్నం అవుతుందన్న వాస్తవాన్ని గుర్తించాలి. దాని నుండి బయట పడాలి అంటే పెట్రోలియం ఉత్పత్తుల ద్వారా వెదజల్లుతున్న కాలుష్యానికి అడ్డుకట్ట వేయాలి. దానికోసం విద్యుత్ వాహనాల వినియోగం తప్పనిసరి అవుతుంది. విద్యుత్ వాహనాల వినియోగంలో ఎటువంటి అపోహలకు తావు లేదు. పర్యావరణ సమస్యను మొట్టమొదటి సారిగా గుర్తించిందే ముఖ్యమంత్రి కేసీఆర్. దానిని అధిగమంచడానికే హరితహారం కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణ రాష్ట్రంలో హరితహారం ఇప్పుడు ఒక ఉద్యమంలా కొనసాగుతోంది. అందుకు కొనసాగింపుగా విద్యుత్ వాహనాల వినియోగం పై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగానే టీఎస్ రెడ్కో ఆధ్వర్యంలో విద్యుత్ వాహనాల ప్రదర్శన ప్రారంభించుకున్నాం. దాని కోసం ఈఈఎస్ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు భాగస్వామ్యం అయ్యాయి. అదే సమయంలో డిమాండ్ కు తగినట్లుగా సప్లై లేకపోయినప్పటికీ వాడకం పై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరిమీద ఉంది. అదే సమయంలో రిపేరింగ్, ఛార్జింగ్ వంటి వాటిపై ఎటువంటి అపోహలకు ఆస్కారం లేదు. ఇప్పటి వరకు 136 ఛార్జింగ్ కేంద్రాలను ప్రారంభించాం. ఇకపై జాతీయ రహదారుల మీద కూడా ఛార్జింగ్ స్టేషన్లు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.. అని మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు.