సిటీబ్యూరో, నవంబర్ 9(నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్‌కు ఎంఐఎం కీలక సమయంలో హ్యాండిచ్చింది. ఉప ఎన్నికలో పట్టు కోసం పరితపిస్తున్న రేవంత్‌రెడ్డికి ఝలక్ ఇచ్చినట్టుగా ప్రచారం నుంచి మొదలుకొని, మద్దతు కూడగట్టడం వరకు అంటీముట్టనట్టు వ్యవహరించింది. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైన కాంగ్రెస్ సర్కారు.. ఎంఐఎం మద్దతుతోనైనా ఓట్లు కొల్లగొట్టాలని చూసింది. కానీ రేవంత్‌రెడ్డి నోటి దురుసు, అజారుద్దీన్‌కు మంత్రి పదవి కట్టబెట్టడం ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ను రెచ్చగొట్టింది. దీంతో ప్రచారంలో పార్టీ వర్గాలకు ఎంఐఎం నేతలు దూరంగా ఉంటూ వచ్చారు.
మైనారిటీ ఓటర్లను ఆకట్టుకునేందుకు..
నియోజకవర్గంలో లక్షా 20వేల పైగా ఉన్న ముస్లిం ఓటర్లు.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు, ఓటములను నిర్ణయించే స్థాయిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి వీరి ఓట్లు కీలకంగా మారాయి. ఎలాగైనా మైనారిటీ ఓటు బ్యాంకును దక్కించుకుకోవాలని విశ్వప్రయత్నాలు చేసింది. అందులో భాగంగా జూబ్లీహిల్స్ టికెట్ ఆశించి భంగపడిన అజారుద్దీన్‌ను ప్రసన్నం చేసుకునేలా ప్యారాచూట్ మంత్రి పదవిని కట్టబెట్టింది. ఇక మైనారిటీలకు శ్మశానవాటిక ఇస్తామంటూ నాటకీయ పరిణామాలకు తెరలేపింది. ఇక బీఆర్ఎస్ నేత సర్దార్ మృతికి కారకుడైన బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్‌ను వెంట పెట్టుకోవడం మైనారిటీలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.
ఇలా ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి అన్ని విషయాల్లో దూరమై, అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చిన బీఆర్ఎస్కు దగ్గరయ్యారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపినాథ్కే తమ మద్దతు అంటూ బహిరంగంగానే తేల్చిచెప్పారు. ఇక గూండాగిరీతో స్థానికంగా పేద, మధ్యతరగతి వర్గాలు, చిరు వ్యాపారులను వేధింపులకు పాల్పడి, ఈ రంగంపై ఆధారపడిన పేదల ముస్లింలను కూడా దూరం చేసుకున్నది. ఇలా మొత్తానికి ముస్లింలను ఓటర్లుగానే పరిగణించిన కాంగ్రెస్ పార్టీ.. చివరకు వారే తిరస్కరించే పరిస్థితి రావడంతో నేతలు తలలు పట్టుకుంటున్నారు.
అజార్‌కు మంత్రి పదవి కట్టబెట్టినా..
కాంగ్రెస్‌కి బహిరంగంగానే మద్దతు తెలిపిన ఓవైసీని.. ముస్లిం వర్గాలు లెక్కచేయకపోవడంతో అధికార పార్టీ మరో ఎత్తు వేసింది. ఎలాగైనా వారిని ఆకర్షించేందుకు మైనారిటీ కోటాలో అజారుద్దీన్‌కు ఆగమేఘాల మీద మంత్రి పదవి కట్టబెట్టింది. అయినా ఓటర్లు అధికార పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉండడంతో ఆ ప్రయోగం బెడిసికొట్టింది. మైనారిటీల సంక్షేమానికి కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తామని మోసగించిన కాంగ్రెస్‌ను వారు నమ్మడం లేదు. షాదీముబారక్ వంటి పథకాలకు స్వస్తి పలికిన హస్తం పార్టీకి ఎందుకు ఓటు వేయాలని ప్రచారానికి వచ్చిన నేతలను నిలదీశారు. దీంతో ఓవైసీ మద్దతు నీరుగారినైట్లెంది. చివరకు అజారుద్దీన్‌ను కాంగ్రెస్ పార్టీ చెల్లని నోటుగా మార్చింది.