Hyderabad Metro | సిటీబ్యూరో, ఆగస్టు 10(నమస్తే తెలంగాణ) ః నగరాన్ని ముంచెత్తిన భారీ వానలతో మెట్రో యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. సాధారణ రోజుల్లోనే వాతావరణంలో కాలుష్యం, భారీ రద్దీతో మొరాయించే మెట్రో కోచ్లు… భారీ వర్షాలతో సడెన్ బ్రేక్ డౌన్ అవకాశాలు మరింత ఎక్కువే. దీనికి ప్రత్యామ్నాయమనేది లేకపోవడంతో మెట్రో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.
సాధారణ రోజుల్లోనే కిక్కిరిపోయే మెట్రో స్టేషన్లు… మోస్తారు వర్షానికే కాలు పెట్టే అవకాశం లేకుండా స్టేషన్లు, బోగీలు నిండిపోవడంతో ఎప్పుడూ ఆగిపోతుందోననే భయాందోళనలతోనే నిర్వహణ సాగుతుంది. స్వయం చాలక వ్యవస్థగా గుర్తింపు పొందిన హైదరాబాద్ మెట్రోకు ఇటీవల సడెన్ బ్రేక్ డౌన్ సమస్యగా మారింది. ఆకస్మికంగా సంభవించే సాంకేతిక సమస్యలతో ప్రయాణికులతోపాటు, మెట్రో సంస్థ కూడా ఆందోళన చెందుతుంది.
రద్దీ ఎక్కువగా ఉన్న సందర్భంలో ఆకస్మికంగా ఆగిపోతే అర గంటపాటు రాకపోకలు ఇతర మార్గాల్లోనూ నిలిచిపోతున్నాయి. ఇదేమి కొత్తేమి కాకపోయినా… భారీ వర్షాల నేపథ్యంలో ప్రయాణికులకు అత్యంత సమస్యగా మారింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ మలక్పేట్ నుంచి నిత్యం లక్డీకాపూల్ వరకు రాకపోకలు సాగించే ప్రయాణికుడు మాట్లాడుతూ… “ఈ మార్గంలో అసలే మలుపులు ఎక్కువ.
ఏమాత్రం సమస్యలు వచ్చిన వెంటనే ఆగిపోతుంది. అందులో భారీ వర్షాలు. గత కొంతకాలంగా యథేచ్చగా సంభవిస్తున్న టెక్నికల్ సమస్యలతో మెట్రో ప్రయాణమే భయపెడుతోంది. కనీసం నిలబడే చోటు లేకున్నా…. అనివార్యంగానే మెట్రోనూ ఆశ్రయిస్తున్నాం” అంటూ మెట్రో సడెన్ బ్రేక్ డౌన్లపై సగటు ప్రయాణికుడు అభిప్రాయంతో ఉన్నాడు.
రద్దీ నిర్వహణతో ఉపశమనం…
రద్దీ నిర్వహణతో కొంత ఉపశమనం ఉంటుందనీ పలువురు ప్రయాణికులు వివరించారు. ముఖ్యంగా పీక్ ఆవర్స్లో వెహికిల్ ఫ్రీక్వెన్సీ పెంచిన కొంత ఉపశమనం దొరుకుతుందనీ, ఫ్రీక్వెన్సీలో మార్పులు చేయడం వలన సమస్యతో ఇబ్బందులు ఉండవని ఐటీ కారిడార్ వైపు ప్రయాణించే హబ్సిగూడకు చెందిన మరో ప్రయాణికుడు పేర్కొన్నారు.