గ్లోబల్ సిటీగా అవతరిస్తున్న హైదరాబాద్ మహానగరం నలువైపులా విస్తరిస్తున్నది. ఇందుకు తగ్గట్టుగానే తెలంగాణ ప్రభుత్వం చక్కటి మౌలిక వసతులు కల్పిస్తున్నది. అదే సమయంలో దీర్ఘ్ఘకాలిక ప్రణాళికలనూ సిద్ధం చేస్తున్నది. ముఖ్యంగా ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో మార్గం పొడిగింపుగా శంషాబాద్ వెంబడి తుక్కుగూడ ఓఆర్ఆర్ ఇంటర్‌ఛేంజ్ వరకు మెట్రో రూట్‌పై తాజాగా అధ్యయనం చేయనున్నారు. సౌత్‌జోన్‌గా ఉన్న శంషాబాద్, తుక్కుగూడ, మహేశ్వరం, ఆదిబట్ల ప్రాంతాలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయి. దీంతో కోర్‌సిటీ నుంచి మెట్రో మార్గం కల్పిస్తే భవిష్యత్ ప్రజా రవాణా అవసరాలు తీర్చే ప్రాజెక్టుగా నిలుస్తుంది. ఔటర్ చుట్టూ ఇప్పటికే స్థలం అందుబాటులో ఉండడంతో నిర్మాణం సులభమే. ప్రస్తుతం రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు 31 కి.మీ మెట్రో మార్గాన్ని నిర్మిస్తుండగా, అక్కడి నుంచి తుక్కుగూడ వరకు 15 కి.మీ దూరం ఉంది.
ఏ దేశ ప్రగతి అయినా ఆ దేశంలో ఉన్న రవాణా వ్యవస్థలపై ఆధారపడి ఉంటుంది. మెరుగైన రవాణా సదుపాయం ఆదేశ అభివృద్ధికి ఆయుపట్టు. ఇదే విషయాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా విస్తరిస్తున్న భాగ్యనగరంలో ఉన్నతమైన రవాణా వసతులు కల్పించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నది. హైదరాబాద్ మెట్రో సత్ఫలితాలు ఇవ్వడంతో అదే స్ఫూర్తితో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రజా సంక్షేమమే పరమావధిగా ఉన్నతమైన ప్రమాణాలతో కూడిన రవాణా సదుపాయాలను కల్పించేందుకు వడివడిగా ముందుకెళ్తున్నది.
సిటీబ్యూరో, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): విశ్వనగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘ కాలిక ప్రణాళికలను సిద్ధం చేస్తున్నది. నగరం నలువైపులా విస్తరించేందుకు అవకాశం ఉండడంతో ప్రభుత్వ పరంగా మెరుగైన మౌలిక వసతులు కల్పించడంపై దృష్టి సారించింది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో లైన్‌కు పొడిగింపుగా శంషాబాద్ ఔటర్ రింగు రోడ్డు వెంబడి తుక్కుగూడ ఓఆర్ఆర్ ఇంటర్చేంజ్ వరకు మెట్రో మార్గం నిర్మాణంపై అధ్యయనం చేయనున్నారు. నగరానికి వెస్ట్ జోన్లో ఉన్న ఐటీ కారిడార్‌లో అభివృద్ధి జరిగినట్లే, సౌత్ జోన్‌గా ఉన్న శంషాబాద్, తుక్కుగూడ, మహేశ్వరం, ఆదిభట్ల ప్రాంతాల్లో క్రమంగా అభివృద్ధి చెందుతున్నాయి. హర్డ్‌వేర్ పార్కు, ఈ-సిటీ, రంగారెడ్డి కలెక్టరేట్, ఫార్మాసిటీ, అమెజాన్ డేటా సెంటర్ వంటి సంస్థలు ఇటువైపే ఉండడంతో నగరం నుంచి మెట్రో మార్గం కల్పించడం ద్వారా భవిష్యత్ ప్రజా రవాణా అవసరాలు తీర్చే ప్రాజెక్టుగా మెట్రో మారనుంది.
ఔటర్ చుట్టూ ఇప్పటికే రైల్వే మార్గం కోసం స్థలం అందుబాటులో ఉండడంతో నిర్మాణం చేపట్టడం సులభం అవడమే కాకుండా తక్కువ వ్యయంతోనే అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రజా రవాణా వ్యవస్థను కోర్ సిటీ నుంచి అభివృద్ధి చెందుతున్న శివారు ప్రాంతాలకు తీసుకువచ్చేందుకు ఇది దోహదం చేస్తుంది. శంషాబాద్,తుక్కుగూడ,మహేశ్వరం, ఆదిభట్ల ప్రాంతాలను పరిగణలోకి తీసుకొని హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేయనుంది. ప్రస్తుతం రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు 31 కి.మీ మెట్రో మార్గాన్ని నిర్మిస్తుండగా.. అక్కడి నుంచి తుక్కుగూడ వరకు 15 కి.మీ దూరం ఉంది. ఈ దూరం పూర్తిగా ఓఆర్ఆర్ పరిధిలోనే ఉండడంతో ప్రాజెక్టు వ్యయంపైనా అంచనా వేయనున్నారు.
గ్రీన్ మొబిలిటీకి అధిక ప్రాధాన్యత..
మెట్రో ప్రయాణం అంటే పూర్తిగా కాలుష్య రహిత ప్రజా రవాణా వ్యవస్థ. దీనిని గ్రేటర్ వ్యాప్తంగా అమలు చేసేలా ప్రణాళకిలు రూపొందిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఈ-మొబిలిటీ వీక్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. భవిష్యత్‌లో కాలుష్య రహిత ఇంధన వినియోగంపై తమ భవిష్యత్‌ను స్పష్టం చేసింది. ఏకంగా 4 చోట్ల ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన రకరకాల ఉత్పత్తుల తయారీకి పారిశ్రామిక కారిడార్లను సిద్ధం చేసింది. వేలాది కోట్ల పెట్టుబడులతో పలు కంపెనీల తమ కార్యకలాపాలను ఇప్పటికే ప్రారంభించాయి. వీటిలో ఈ-సిటీ ప్రాజెక్టు మహేశ్వరంలోనే ఉంది. ఇందులో భాగంగానే గ్రీన్ మొబిలిటీని మరింతగా ప్రోత్సహించేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు నిర్మిస్తున్న మెట్రో మార్గాన్ని మరో 15 కి.మీ దూరంలో ఉన్న తుక్కుగూడ ఓఆర్ఆర్ ఇంటర్చేంజ్ వరకు పొడిగించేందుకు ప్రాథమికంగా అధ్యయనం చేస్తున్నారు.
భవిష్యత్ లాజిస్టిక్ హబ్‌గా శంషాబాద్-తుక్కుగూడ…
హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై శంషాబాద్ ఔటర్ రింగు రోడ్డు సమీపంలోని తొండుపల్లి ప్రాంతాల్లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) లాజిస్టిక్ పార్కును అభివృద్ధి చేసే ప్రణాళికల్లో ఉంది. ఇప్పటికే శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఈ-కామర్స్‌కు సంబంధించిన కంపెనీలకు గోడౌన్స్ భారీ ఎత్తున విస్తీర్ణంలో ఉండగా, బయట సైతం పలు ప్రైవేటు సంస్థలు విశాలమైన ప్రాంగాల్లో బహుళ వినియోగ గోడౌన్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు శంషాబాద్-తుక్కుగూడ మార్గం ప్రధాన కేంద్రంగా మారుతున్నది. కాలనుగుణంగా హైదరాబాద్ మహానగరం ఔటర్ రింగు రోడ్డు చుట్టూ విస్తరించేందుకు అవకాశం ఉండడంతో మెట్రో మార్గాన్ని దశల వారీగా నిర్మించేందుకు అవసరమైన అధ్యయనంపై హైదరాబాద్ మెట్రో ప్రత్యేకంగా దృష్టి సారించింది.
దక్షిణ హైదరాబాద్ వైపు ఉన్న ప్రాజెక్టులు..