సిటీబ్యూరో, జనవరి 19 (నమస్తే తెలంగాణ): కొత్తగా ప్రతిపాదించిన మెట్రో మార్గాలపై క్షేత్ర స్థాయిలో మెట్రో అధికారులు సర్వే పనులు మొదలు పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు రెండో దశలో భాగంగా మొత్తం 5 మార్గాల్లో 76 కి.మీ మేర నిర్మించాలని ప్రతిపాదించారు. ఇందులో రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు ప్రతిపాదించిన 12 కి.మీ మార్గంలో బయోడైవర్సిటీ జంక్షన్, ట్రిపుల్ ఐటీ జంక్షన్, ఐఎస్బీ రోడ్డు, విప్రో లేక్, అమెరికన్ కాన్సులేట్ (ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్) వరకు కొత్తగా మార్గాన్ని నిర్మించాలని నిర్ణయించారు.
ఈ మేరకు హైదరాబాద్ మెట్రో అధికారులు కన్సల్టెంట్లతో కలిసి రోడ్డు మార్గంలో రూట్ మ్యాప్‌లను పరిశీలించారు. బయోడైవర్సిటీ జంక్షన్ తర్వాత గచ్చిబౌలి ఓఆర్ఆర్ చౌరస్తా మీదుగా ట్రిపుల్ ఐటీ వరకు నిర్మించే మార్గంలో చాలా అడ్డంకులు ఉన్నాయని ప్రాథమికంగా గుర్తించారు. ముఖ్యంగా గచ్చిబౌలి జంక్షన్లో ఇప్పటికే 3 అంతస్థుల్లో ఫ్లైఓవర్ల నిర్మాణాలు ఉన్నాయి. వీటి మీదుగా మెట్రో మార్గాన్ని నిర్మించాలంటే ఎత్తుతో పాటు నిర్మాణ వ్యయం పెరిగి, పనులు చేపట్టడం సంక్లిష్టంగా మారుతుంది. ప్రత్యేకంగా భూసేకరణ చేయాల్సి ఉంటుంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన రాయదుర్గం-ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రాజెక్టులో ప్రతిపాదించిన కొంత మార్గాన్ని ప్రత్యామ్నాయంగా తీసుకోవాలని నిర్ణయించారు.
అనుకూలంగా గత ప్రభుత్వ ప్రతిపాదిత మార్గం…
ఐటీ కారిడార్‌లోని రాయదుర్గం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు గత కేసీఆర్ ప్రభుత్వం ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్ మార్గాన్ని 31 కి.మీ మేర నిర్మించాలని నిర్ణయించి, దానికి అనుగుణంగానే రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసి క్షేత్ర స్థాయిలో భూములను సైతం సేకరించారు. అంతలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఎయిర్‌పోర్టు మెట్రో మార్గాన్ని పక్కన పెట్టి, కొత్తగా 5 మార్గాలను ప్రతిపాదించి వాటిపై అధ్యయనం చేయాలని మెట్రో అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ఇందులో రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు ప్రతిపాదించిన 12 కి.మీ మార్గంలో గచ్చిబౌలి మీదుగా కాకుండా.. గత కేసీఆర్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మార్గంలో నానక్‌రాంగూడ ఓఆర్ఆర్ ఇంటర్చేంజ్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ వరకు మెట్రో మార్గాన్ని నిర్మించడానికి అనుకూలంగా ఉందని మెట్రో అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
రాయదుర్గం వద్ద ప్రారంభమయ్యే మెట్రో లైను బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద ఎలాంటి వంపులు లేకుండా నేరుగా ఖాజాగూడ చెరువు వైపు ఉన్న రోడా మిస్ట్రీ కాలేజ్ ఆఫ్ సోషల్ వర్క్ అండ్ రీసెర్చ్ సెంటర్ మీదుగా నానక్‌రాంగూడ వెళ్లే రోడ్డుకు అనుసంధానం చేయడం ద్వారా.. తక్కువ వ్యయంతో పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా మెట్రో నిర్మాణం పనులు చేపట్టేందుకు అనుకూలమైన మార్గంగా ఉందని మెట్రో అధికారులు తెలిపారు. ఈ ప్రతిపాదనతో ఉన్న సానుకూల అంశాలతో ఒక నివేదికను మెట్రో అధికారులు రూపొందించి సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నారు.
ఖాజాగూడలో 8 ఎకరాల భూసేకరణ..
గత కేసీఆర్ ప్రభుత్వం రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు వరకు 31 కి.మీ మేర ప్రతిపాదించిన మార్గంలో భూసేకరణ పనులు సైతం చేపట్టింది. బయోడైవర్సిటీ చౌరస్తా దాటిన తర్వాత ఉన్న ఖాజాగూడ పరిధిలో సుమారు 8 ఎకరాల భూమిని మెట్రో ప్రాజెక్టు కోసం గత కేసీఆర్ ప్రభుత్వమే కేటాయించింది. అందులో భూమిని చదును చేయడంతో పాటు ప్రాథమికంగా మార్కింగ్ పనులు చేపట్టింది. దీన్ని సద్వినియోగం చేసుకుంటే రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ వరకు నిర్మించే మెట్రో మార్గాన్ని త్వరగా పూర్తి చేయడంతో పాటు తక్కువ వ్యయంతో నిర్మించవచ్చని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
గత ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో మార్గంలో ఇప్పటికే ఖాజాగూడ-నానక్‌రాంగూడ రోడ్డు మెట్రో నిర్మాణానికి అనువుగా ఉండటంతో పాటు భూసార పరీక్షలను కూడా నిర్వహించారు. రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి నానక్‌రాంగూడ ఓఆర్ఆర్ జంక్షన్ వరకు అవసరమైన అన్ని రకాల అధ్యయనం, నిర్మాణం చేపట్టడానికి చర్యలను అధికారులు పూర్తి చేశారు.