నాలుగు శతాబ్దాల పైచిలుకు నాటి మాట. వర్షాలు, వరదలలో చిక్కుకుని ఎలుకలు చచ్చిపోయి ప్లేగువ్యాధి వ్యాపించి హైదరాబాద్ నగర ప్రజలు వందలాదిగా ప్రతి సంవత్సరం చనిపోతుండేవారు. 1591 సెప్టెంబర్లో కురిసిన వర్షాలకు మూసీ నది ఉప్పొంగగా దాని వరదలలో చిక్కుకుని ఎలుకలు చచ్చి ప్లేగు మహమ్మారి వ్యాపించగా ఆనాటి గోల్కొండ నగరంలో వందలాది మంది చనిపోయారని, ఆ బాధా నివారణార్ధం ఆనాటి సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్షా 1591 అక్టోబర్ 19న చార్మినారుకు శంకుస్థాపన చేసి నూతన నగర నిర్మాణం చేపట్టి ప్లేగుబాధలను నివారించారు.
నాలుగు వందల సంవత్సరాల తరువాత 1908 నాటి మూసీ వరదలకు కూడా హైదరాబాదు నగర ప్రజలు వేలాదిగా బలయ్యారు. వరదలలో కొట్టుకుపోయి ఎలుకలు చచ్చి ప్లేగు వ్యాధి వ్యాపించడం అనే సమస్య మరోమారు ఎదురయ్యింది. 1908 నుంచి ప్రతి సంవత్సరం వర్షాలు – వరదలు – ఎలుకల సమస్యతో ప్లేగువ్యాధి ప్రబలి వందలాది ప్రజలు చనిపోవడం హైదరాబాదులో సాధారణమైపోయింది. ఆనాటి నిజాం ప్రభువు ఎలుకల బాధా నివారణకై ఆధునిక పద్ధతుల్లో హైదరాబాద్ నగర నిర్మాణం – అభివృద్ధి – సుందరీకరణ పనులు చేపట్టాడని చరిత్ర చెప్తుంది. ఏడవ నిజామ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ పట్టాభిషిక్తుడు అయ్యి కాగానే 1911లో కూడా హైదరాబాదులో ప్లేగు వ్యాధి ప్రబలింది. అందుకు చలించిన నిజామ్ వెంటనే వైద్యులతో కూడిన ఒక నిపుణుల సలహా సంఘాన్ని నియమించి మూసీ వరదలు – ప్లేగు వ్యాధి నివారణకై సూచనలు చేయమన్నాడు. ఆ వైద్యుల సలహా సంఘం… పట్టణం పాతదైపోయి కిక్కిరిసిన జనాభాతో పారిశుద్ధ్య సమస్యలను ఎదుర్కొంటున్నదని, దేశంలో నాల్గవ స్థానంలో ఉన్న ఈ నగర కీర్తిని పెంచాలంటే నగర నిర్మాణ శాఖను ఏర్పాటు చేసి ఈ కింది నాలుగు పనులను చేపట్టాలని సూచించింది.
మొదటిది – నదికి ఇరువైపులా కరకట్టల నిర్మాణం: అఫ్జల్ గంజ్ వంతెన నుంచి ముసల్లంజంగ్ వంతెన వరకు మూసీ పొంగి ప్రవహించినా దాని వరద నీరు నగర వీధుల్లోకి రానంత ఎత్తుగా కరకట్టలు నిర్మించాలి. రెండవది – పక్కా రోడ్ల నిర్మాణం: అప్పటి వరకు ఉన్న కంకర రోడ్లను తొలగించి హైదరాబాదు (చార్మినార్) నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్ వరకు రెండు వరుసల రోడ్లను సిమెంటు లేదా తారుతో వేయాలి. పత్తరఘట్టి రోడ్డును వెడల్పు చేసి, దానికి ఇరువైపులా అసఫ్జాహీ శైలి మంటపాలను నిలిపి సుందరీకరణ చర్యలు చేపట్టాలి. మూడవది – ఎలుకలు ప్రవేశించకుండా భూగర్భ మురికి కాల్వలు, గృహాల నిర్మాణం: అక్బర్జా బజార్, సుల్తాన్ షాహి, నాంపల్లి ప్రాంతాలలో ఇరుకైన పెంకుటిండ్లను తొలగించి, వీధులను వెడల్పు చేసి, గాలి వెలుతురు ప్రవేశించే విశాలమైన పక్కా గృహాలను నిర్మించి బీదసాదలకు చౌకైన అద్దెలకు అందుబాటులోకి తేవాలి. నాల్గవది – భూగర్భ మురుగునీటి కాల్వల నిర్మాణం: వర్షాకాలపు వరదల వల్ల ఎలుకలు చచ్చి ప్లేగువ్యాధి వ్యాపించకుండా భూగర్భ మురుగునీటి కాల్వలను నిర్మించాలి.
పైన ప్రస్తావించిన విధంగా వైద్యుల సలహా సంఘం సూచించిన నాలుగు పనుల్లో రెండు పనులు ఎలుకల సంబంధ ప్లేగు మహమ్మారి నివారణకు సంబంధించినవి కావడం గమనార్హం. పై సూచనలకు అనుగుణంగా 1913 లో హైదరాబాద్ నగర నిర్మాణ శాఖ ఏర్పడి 1914 నవంబర్ నుంచి 1940 ల వరకు సంవత్సరానికి సుమారు లక్ష రూపాయల చొప్పున నిధులను వెచ్చిస్తూ పై పనులన్నింటిని చేపట్టింది. ఆ పనులు చేపట్టబట్టే తదనంతర కాలంలో ప్లేగుబాధలు తగ్గి ప్రజల ప్రాణాలు రక్షించబడ్డాయి. ఈ విషయమై ఆనాటి (1941లో) నిజాం కాలేజి ప్రొఫెసర్ కురుగంటి సీతారామయ్య తన పుస్తకం’ ఆదర్శ ప్రభువు పంచవింశతి వర్ష రాజ్య చరిత్రము’లో ఇలా రాశారు: ప్లేగింక నున్నను, నది మిక్కిలి స్వల్పముగా నుండి, శీఘ్రముగా నిర్మూలించుట కవకాశము కల్గి, వెనుకటివలె పురజనులందరు నిండ్లు వదలి యూరి బైట నుండు స్థితికి తెచ్చుట లేదన్న, శ్రీవారు (నిజాం) ఈ కాలమున చేసిన యత్న ఫలమేనని వేరుగా చెప్పవలెనా? ఆ తరువాత శతాబ్ద కాలంగా హైదరాబాద్ లోని చార్మినార్, కాచిగూడ, సుల్తాన్ షాహి, నాంపల్లి, పత్తరఘట్టి, అఫ్టల్గంజ్, ముసల్లంగంజ్ ప్రాంతాలలో కొత్త విశాలమైన వీధి రోడ్లు గాని, ఇండ్లు గాని, మురికి కాలువలు గాని నిర్మించకపోవడం గమనార్హం.
– డా. ద్యావనపల్లి సత్యనారాయణ 9490957078