రంగారెడ్డి, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని కొహెడలో ఆసియాలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్‌ను నిర్మించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం కొహెడలోని సర్వేనంబర్ 507, 548లో 170 ఎకరాల భూమిని కూడా కేటాయించింది. అయితే ప్రభుత్వం మారి.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రూ.3,000 కోట్లతో కొహెడలో అతిపెద్ద పండ్ల మార్కెట్‌ను నిర్మించేందుకు డీపీఆర్‌నూ సిద్ధం చేసింది. మార్కెట్ నిర్మాణానికి అవసరమయ్యే రూ.3,000 కోట్లు సమకూర్చడం ఇబ్బందికరంగా మారిన దృష్ట్యా డీపీఆర్‌ను సీఎంవోలోనే నిలిపేసింది.
పండ్ల మార్కెట్ శాశ్వత నిర్మాణం ఇప్పట్లో జరిగే అవకాశాలు లేక పోవడంతో కొహెడలో తాత్కాలికంగా షెడ్లను ఏర్పాటుచేసి బాటసింగారంలోని పండ్లమార్కెట్‌ను అక్కడికి తరలించాలని పాలకవర్గం నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల జరిగిన సమావేశంలో పాలకవర్గం నిర్ణయించి ప్రభుత్వానికి నివేదికను అందించినట్లు సమాచారం. కానీ, తాత్కాలిక షెడ్లలో పండ్ల మార్కెట్ ఏర్పాటు చేయొద్దని పూర్తిస్థాయి నిర్మాణాలతోపాటు అన్ని వసతులు కల్పించిన తర్వాతే మార్కెట్‌ను కొహెడకు తరలించాలని కమీషన్ ఏజెంట్లు కోరుతున్నారు.
నెలకు అద్దె..రూ.70లక్షలు
బాటసింగారంలోని హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఉన్న లాజిస్టిక్ పార్కులో కొనసాగుతున్న పండ్ల మార్కెట్‌కు మార్కెటింగ్‌శాఖ ప్రతినెలా రూ.70 లక్షలను అద్దె రూపంలో చెల్లిస్తున్నది. బాటసింగారంలోని పండ్ల మార్కెట్ 30 ఎకరాల్లో ఉండగా.. అందులో 15 ఎకరాలు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో లాజిస్టిక్ పార్కులో.. మరో ఆరుగురు రైతులకు సంబంధించిన 15 ఎకరాల్లో ఈ మార్కెట్ కొనసాగుతున్నది. ప్రైవేట్ భూముల్లో తాత్కాలిక షెడ్లువేసి క్రయవిక్రయాలు సాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ మార్కెట్లో 313 మంది కమీషన్ ఏజెంట్లు ఉన్నారు.
నాడు తాత్కాలిక షెడ్లను వ్యతిరేకించిన కాంగ్రెస్..
గత బీఆర్ఎస్ హయాంలో కొహెడలో తాత్కాలిక పండ్ల మార్కెట్‌ను ఏర్పాటు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. గాలి దుమారానికి షెడ్లు కూలిపోవడాన్ని కూడా తప్పు పట్టి తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. కానీ, అదే స్థానంలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది. తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేయడంతో నిధులు దుర్వినియోగం కావడంతోపాటు కమీషన్ ఏజెం ట్లు తాత్కాలిక షెడ్లలోకి వెళ్లేందుకు సుముఖం చూపడం లేదు. ఈ నేపథ్యంలో మార్కెట్ పాలకవర్గం ఎలాంటి నిర్ణ యం తీసుకుంటుందోనని ఏజెంట్లు ఎదురుచూస్తున్నారు.
డీపీఆర్ నిధులు వచ్చేనా..
ఆసియాలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్‌ను కొహెడలో అత్యాధునిక హంగులతో నిర్మిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. దాని నిర్మాణానికి రూ.3,000 కోట్లు అవసరముందని డీపీఆర్‌నూ సిద్ధం చేసింది. ప్రస్తుతం ఈ నివేదిక సీఎంవోలో పెండింగ్‌లో ఉన్నది. డీపీఆర్‌కు అవసరమైన నిధులు ప్రస్తుత పరిస్థితిలో ప్రభుత్వం కేటాయించే అవకాశాల్లేవని సమాచారం. దీంతో కొహెడలో శాశ్వత పండ్ల మార్కెట్ నిర్మాణం మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి.

కోర్టు ఆదేశాలు బేఖాతర్..
గడ్డిఅన్నారంలో ఉన్న పండ్ల మార్కెట్లో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించాలనే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం దానిని కొహెడకు తరలించింది. ఇందుకోసం కొహెడలో తాత్కాలిక షెడ్లను కూడా ఏర్పాటు చేయించింది. ఆ సమయంలో గాలివాన బీభత్సంతో తాత్కాలిక షెడ్లు నేలకూలడంతో.. బాటసింగారంలో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఉన్న లాజిస్టిక్ పార్కును అద్దెకు తీసుకుని అందులోకి మా ర్చారు. దీంతో కమీషన్ ఏజెంట్లు కోర్టును ఆశ్రయించారు. పూర్తిస్థాయి నిర్మాణం చేపట్టిన తర్వాతే మా ర్కెట్‌ను ఎక్కడికైనా తరలించాలని వారు కోర్టును అభ్యర్థించగా..ప్రభుత్వం మార్కెట్‌కు కొహెడలో కేటాయించిన సొంత భూమిలో ఆరు మాసాల్లో శాశ్వత భవనాలు, షెడ్లను నిర్మించాలని 2022లో హైకోర్టు మార్కెటింగ్‌శాఖను ఆదేశించింది. అప్పటినుంచి ఇప్పటి వరకూ కొహెడలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. దీంతో కమీషన్ ఏజెంట్లు మార్కెటింగ్శాఖపై కోర్టు ధిక్కరణ కేసును దాఖలు చేశారు. వివిధ కారణాలతో గత మూడేండ్లుగా హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా బాటసింగారంలో ఉన్న లాజిస్టిక్ పార్కులోనే మార్కెట్‌ను కొనసాగిస్తున్నారు.
నిర్మాణం పూర్తైన తర్వాతే తరలించాలి
ప్రస్తుతం బాటసింగారం లాజిస్టిక్ పార్కులో కొనసాగుతున్న పండ్ల మార్కెట్లో ఎలాంటి సౌకర్యాల్లేవు. కరెంటు, మరుగుదొడ్లు, తాగునీరు, భద్రత సరిగ్గాలేదు. అయినప్పటికీ ప్రభు త్వ సూచనల మేరకు ఇక్కడ కొనసాగుతున్నాం. కొహెడలో శాశ్వత మార్కెట్‌ను నిర్మించి ఆరుమాసాల్లో అక్కడికి మార్కెట్‌ను తరలించాలని హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం పట్టించుకోవటంలేదు. -ప్రదీప్, వ్యాపారి
హైకోర్టు ఆదేశాలు పాటించాలి
కొహెడలో అన్ని హంగులతో ఆరు మాసాల్లో శాశ్వతంగా పండ్లమార్కెట్‌ను నిర్మించాలని 2022లో హైకోర్టు మార్కెటింగ్ శాఖను ఆదేశించింది. మూడేండ్లు గడిచినా ఇప్పటివరకూ మార్కెట్ నిర్మాణానికి ఒక్క రాయికూడా వేయలేదు. ఇప్పటికే పలుసార్లు మంత్రులు, ఎమ్మెల్యేలు, మార్కెటింగ్ శాఖ అధికారులను కలిసి వినతిపత్రాలను ఇచ్చినా ఫలితం లేదు. వెంటనే కొహెడలో శాశ్వత పండ్లమార్కెట్‌ను నిర్మించాలి.
-అఫ్సర్, కమీషన్ ఏజెంట్