శాతవాహన యూనివర్సిటీ రెండో స్నాతకోత్సవానికి సిద్ధమవుతున్నది. ఈ నెల 7న నిర్వహించే కార్యక్రమానికి యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఉమేశ్ కుమార్ ఆధ్వర్యంలో పనులు వడివడిగా జరుగుతున్నాయి. వర్సిటీ చాన్స్‌లర్, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ స్నాతకోత్సవానికి అధ్యక్షత వహించనుండగా, ముఖ్య అతిథిగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బీజే రావు హాజరుకానున్నారు.
కరీంనగర్ కమాన్ చౌరస్తా, నవంబర్ 1 : స్నాతకోత్సవానికి శాతవాహన యూనివర్సిటీ ముస్తాబవుతున్నది. ఈ సందర్భంగా పట్టభద్రులకు పట్టాలతో పాటు పలువురు విద్యార్థులకు బంగారు పతకాలు అందించేందుకు వీసీ ఉమేశ్‌కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా యూనివర్సిటీ పరిధిలో 161 మందికి బంగారు పతకాలు, 25 మందికి పీహెచ్డీ పట్టాలు అందించనున్నారు. అలాగే, ఇటీవల అమెరికా పర్యటన ముగించుకున్న వీసీ, పలువురు ఎన్ఆర్ఐ సహకారంతో శాతవాహన ట్రస్ట్ కోసం ప్రత్యేక కృషి చేశారు. ఈ క్రమంలో 2026లో అందించే పతకాల కోసం దాదాపు 60 లక్షల నిధులు సమకూర్చగా, అందులో పలువురు గోల్డ్ మెడల్స్, యూనివర్సిటీకి కావాల్సిన కంప్యూటర్లు, డిజిటల్ పరికరాల ఏర్పాటుకు సహకారం అందించేందుకు ముందుకు వచ్చారు.
వడివడిగా ఏర్పాట్లు
స్నాతకోత్సవానికి ఏర్పాట్లు వడివడిగా జరుగుతున్నాయి. వర్సిటీ ఆవరణలోని క్రీడా మైదానంలో భారీ వేదిక ఏర్పాటుకు పనులు జరుగుతున్నాయి. రాష్ట్ర గవర్నర్, చాన్స్‌లర్ జిష్ణుదేవ్ వర్మ హాజరవుతుండడంతో ప్రొటోకాల్ ప్రకారం హై సెక్యూరిటీ మధ్యన వర్సిటీ విద్యార్థులు, అతిథులు మాత్రమే హాజరయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పీహెచ్డీ, బంగారు పతకాలు అందుకునే విద్యార్థుల లిస్ట్ ఆన్లైన్లో ఉండగా, హాజరయ్యే విద్యార్థులు ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. దాని ఆధారంగానే వారికి సీట్లు కేటాయింపు ఉంటుందని, విద్యార్థులతోపాటు మరో వ్యక్తికే ప్రవేశం ఉంటుందని, చిన్న పిల్లలకు ప్రవేశం ఉండదని తెలిపారు.
అట్టహాసంగా నిర్వహిస్తాం
శాతవాహన యూనివర్సిటీ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే పరిపాలనా భవనంతో పాటు సెమినార్ హాల్, ఆడిటోరియం పనులు పూర్తయ్యాయి. ఈ క్రమంలో రెండో స్నాతకోత్సవం ఏర్పాటు చేసుకుని వేడుకలు నిర్వహిస్తున్నాం. దీని కోసం ఇప్పటికే ప్రముఖులకు ఆహ్వానాలు అందజేశాం. యూనివర్సిటీలోని మైదానంలో ఏర్పాట్లు చేస్తున్నాం. గోల్డ్ మెడల్స్, పట్టాలు అందుకునే విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా నమోదు ఏర్పాటు చేశాం. కార్యక్రమాన్ని సైతం అట్టహాసంగా నిర్వహిస్తాం.
– యూ ఉమేశ్‌కుమార్, వైస్ చాన్స్‌లర్ (ఎస్‌యూ)