నల్లగొండ, నవంబర్ 1: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి నెల రోజులైనా కొనకపోవడంతో నారు వేసేంత స్థాయిలో మొలకలు వచ్చి భారీ నష్టం జరిగిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు ముంబాయి, దుబాయిలో తిరుగుతూ జల్సాలు చేయటం కాదు… ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతుల పరిస్దితి ఎలా ఉందో చూసి ఆదుకోవాలన్నారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డితో కలిసి మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి శనివారం నల్లగొండ శివారులోని ఆర్జాలబావి సెంటర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు.
ఇటీవల కురిసిన వర్షాలకు తడిసిన దాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. రైతులకు ధైర్యం చెప్పి ప్రభుత్వం మెడలు వంచి ధాన్యం కొనిపిస్తామని.. అధైర్యపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ ఆర్జాలబావి సెంటర్‌కు ప్రతి సీజన్లో రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందన్నారు. ఈ సీజన్లో వచ్చిన ధాన్యా న్ని సకాలంలో కొనకపోవడంతో సింహభాగం వర్షాలకు తడిసి ముద్దయి మొలకలు వచ్చాయన్నారు. నల్లగొండలో అధికారులు తడిసిన ధాన్యం కొనకుండా రైతులను ఇబ్బందులు పెడుతుంటే జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాత్రం ముంబాయి, దుబాయిలు తిరుగుతూ జల్సాలు చేస్తున్నారని మండి పడ్డారు. ఇదే జిల్లాలో సివిల్ సైప్లె మంత్రిగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి రైతుల గోడు వినపడటం లేదా అని ప్రశ్నించారు.
అంతకుముందు 60 ఏండ్లు ఇదే పరిస్దితి ఉంటే… కేసీఆర్ సీఎం అయ్యాక దేశంలోనే నల్లగొండ జిల్లాలో భారీ ఎత్తున ధాన్యం పండించటంతో పాటు ప్రతి గింజ కొనుగోలు చేసి మద్దతు ధర అందజేసినట్లు తెలిపారు. ఐటీ ఉద్యోగులు కూడా వ్యవసాయం చేసిన పరిస్థితులు నాడు బీఆర్ఎస్ తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక రుణమాఫీ లేదు.. రైతు భరోసా ఎగనామం చేసి చివరికి గత యాసంగిలో ఇవ్వాల్సిన రూ.వెయ్యి కోట్ల సన్నధాన్యం బోనస్ ఇవ్వలేదన్నారు. పత్తి, ధాన్యం విషయంలో ఎన్ని నిబంధనలు ఉన్నా రైతుకు నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం ముందుండి వ్యాపారులను ఒప్పించి.. లేదంటే ప్రభుత్వమే భరించి రైతులకు మద్దతు ధర ఇప్పించాలని డిమాండ్ చేశారు. మొంథా తుపాన్ ఎఫెక్ట్‌కు నల్లగొండ రైతుల ధాన్యం తడిసి విలవిల్లాడుతున్నారని అన్నారు.
ఇకనైనా మంత్రులు, నల్లగొండ ఎమ్మెల్యేలు జూబ్లీహిల్స్‌ను వదలాలని.. మీరెన్ని ప్రచారాలు చేసినా అక్కడ గెలిచే పరిస్థితి లేనందున ఇక్కడ రైతుల బాధైనా చూసి ధాన్యం కొనేలా చూడాలని సూచించారు. వరి కోతలు ప్రారంభానికి ముందే ధాన్యం కొనలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంటే ఇంకా పూర్తి స్థ్దాయిలో కోతలు షురూ అయితే ఎలా కొంటారని ప్రశ్నించారు. నాట్లు వేసిన దగ్గర నుంచి సకాలంలో ఎరువులు ఇవ్వకపోవడంతో సగం పంటే వచ్చిందని, ఇవ్వాల వచ్చిన ఆ సగం పంట కూడా కొనే పరిస్థి లేకుండా ఉంటే రైతు ఎలా బతుకుతాడని ప్రశ్నించారు. నాడు ఎకరాకు రూ.50 వేలు వస్తే ఇవ్వాల రూ.25 వేలు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు.
ధాన్యానికి మద్దతు ధర ఇవ్వకుండా నల్లగొండ మంత్రులు మిల్లర్లు, దళారుల దగ్గర కోట్ల రూపాయ లంచాలు, కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, తిప్పర్తి మాజీ జడ్పీటీసీ తండు సైదులు గౌడ్, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, మారగోని గణేశ్, తుమ్మల లింగస్వామి, రావుల శ్రీనివాస రెడ్డి, బొజ్జ వెంకన్న, బిపంగి కిరణ్, రామ్‌రెడ్డి, రాపోలు వెంకటేశ్వర్లు, కొమ్ముగిరి తదితరులు పాల్గొన్నారు.
తేమ శాతం వచ్చినా సన్నాలు కొనడం లేదు
ఒడ్లు తెచ్చి నెలరోజులైంది. 12 శాతం తేమ వచ్చినా కొనడం లేదని తిప్పర్తి మండలం అల్లిగూడెంకు చెందిన నీరుడు సుజాత వాపోయారు. జగదీశ్‌రెడ్డి సెంటర్‌కు వచ్చిన విషయాన్ని గమనించిన సుజాత ఆయన దగ్గరకు వెళ్లి తాను పండించిన సన్న ధాన్యం చూపించింది. ‘పది ఎకరాలను రూ.12 వేల లెక్కన కౌలు తీసుకొని సన్న ధాన్యం పండించిన. మిల్లుకు తీసుకెళ్తే క్వింటాల్‌కు రూ.1,800 మాత్రమే ఇస్తాన్నరు. ఇక్కడికి 25 రోజుల కింద తీసుకొచ్చిన. వారం కింద తేమ చూస్తే 12 శాతం వచ్చినా సన్నాలు ఇప్పుడు కొనమని అంటున్నరు. వర్షాలకు మొత్తం తడవడంతో ఇప్పుడు 30 శాతం తేమ వస్తున్నది. మొత్తం ఒడ్లలో మూడు పుట్ల దాక మొలకలు వచ్చినయి’ అని చెప్పారు. వెంటనే జగదీశ్‌రెడ్డి పీఏసీఎస్ సీఈవో అనంతరెడ్డిని పిలిచి అడిగితే ప్రస్తుతం దొడ్డు వడ్లు మాత్రమే కొంటున్నామన్నారు. సన్నాలు కనీసం ఒక లారీ వస్తేనే కొంటామన్నారు. ఈ ధాన్యం కొనకుంటే వదిలిపెట్టే ప్రసక్తే లేదని జగదీశ్‌రెడ్డి హెచ్చరించారు.
ఒడ్లు కొంటలేరు.. తడిసి మొలకలొచ్చినయి
‘పది ఎకరాల్లో దొడ్డు వడ్లు వేసినం. 25 రోజుల కింద తీసుకొచ్చి ఇక్కడ పోస్తే తేమ శాతం వచ్చినా కొనకపోవడంతో వర్షాలకు మొత్తం తడిసి మొలకలు వచ్చినయి. ఒడ్లు నేర్పడానికి వస్తున్న సమయంలోనే నా కొడుకుకు యాక్సిడెంట్ అయి కాలు వేలు తొలగించారు. మా బాధ ఎంత చెప్పినా పట్టించుకుంటలేరు. పోసిన ఒడ్లు కాంటా పెట్టడం లేదు’ అని తిప్పర్తి మండలం సోమోరిగూడెంకు చెందిన సువర్ణ జగదీశ్‌రెడ్డికి మొరపెట్టుకున్నారు. పోసిన ధాన్యం ఇప్పటి వరకు పది క్వింటాళ్ల దాక పూర్తిగా మొలకలెత్తాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.