మోండా మార్కెట్లో చిరు వ్యాపారులకు బీఆర్ఎస్ ఎల్లవేళలా అందుబాటులో ఉండటమే కాకుండా అండగా ఉంటామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. దీర్ఘకాలికంగా వ్యాపారాలు చేసుకుంటున్న వారిని కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. అద్దెలు పెంచడం, వ్యాపారులకు నోటీసులివ్వడంపై ఆయన మండిపడ్డారు. వ్యాపారులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని.. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
మారేడ్‌పల్లి, నవంబర్ 1: మోండా మార్కెట్లో దీర్ఘకాలికంగా పలువురు వ్యాపారాలు చేసుకొని జీవనం సాగిస్తున్నారని, వారిని కాంగ్రెస్ ప్రభుత్వం పలు రకాలుగా ఇబ్బందులకు గురి చేయడం సరికాదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. శనివారం మోండా డివిజన్ మటన్ మార్కెట్ వ్యాపారులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను వెస్ట్ మారేడ్‌పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో కలిసి తమ సమస్యలను విన్నవించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే మార్కెట్ ప్రాంతంలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని, ఇది మంచి పద్దతి కాదని చెప్పారు. మార్కెట్లో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ.. కుటుంబాలను పోషించుకుంటున్న పరిస్థితిలో షాపుల అద్దెలు పెంచుతూ, పెంచిన ధర ప్రకారం అద్దెలు చెల్లించాలంటూ జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇవ్వడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 10ఏళ్ల తెలంగాణ ప్రభుత్వంలో ఏ రోజూ చిరు వ్యాపారులను ఇబ్బందులకు గురి చేయలేదని, వారికి అండగా నిలిచామని చెప్పారు. ఈ పరిస్థితులను చూసి ఎవరూ అధైర్య పడవద్దని, వ్యాపారులకు బీఆర్ఎస్ పార్టీ, తాను ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. ఎట్టి పరిస్థితులతో కొత్త అద్దెలు చెల్లించవద్దని చెప్పారు.
తాను జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో మాట్లాడానని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. అవసరమైతే మార్కెట్‌ను బంద్ చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ వైఖరి మార్చుకోకుంటే న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్, ఆకుల హరికృష్ణ, నాగులు, మహేష్ యాదవ్, రాములు, ఒదెల సత్యనారాయణ, మహేందర్, చంద్రప్రకాశ్, అబ్బాస్, మటన్ షాప్ అసోసియేషన్ సభ్యులు అయూబ్, షోయబ్ తదితరులు పాల్గొన్నారు.