Hyderabad | చార్మినార్, జూన్ 20: మెట్రో నిర్మాణంలో చారిత్రక కట్టడాలతో పాటు మతపరమైన కట్టడాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పనులను నిర్వహిస్తున్నామని మెట్రో రైల్ ఇంజనీరింగ్ అధికారి వినోద్ తెలిపారు. శుక్రవారం అయిన తన సిబ్బందితో పాత నగరంలో కొనసాగుతున్న మెట్రో రైల్ నిర్మాణంలో భాగంగా కొనసాగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన కోట్ల అలీజా ప్రాంతంలోని చారిత్రక కోటమైసమ్మ దేవాలయాన్ని సందర్శించారు. ఆలయ నిర్వహకులు ఇంజనీర్ అధికారికి సాదర స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలను అందించారు.
ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. సిబిఎస్ నుండి ఫలక్నూమా వరకు నిర్మితం కానున్న మెట్రో రైల్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతుయన్నారు. ఈ మార్గంలో ఇప్పటికే ఆస్తులు కోల్పోతున్న వారికి నష్ట పరిహారం అందిస్తూ వారి ఆయా కట్టడాలను స్వాధీనం చేసుకుంటున్నామని తెలిపారు. దారులు షిఫా నుండి ఫలక్నుమా వరకు కొనసాగనున్న మార్గంలో చారిత్రక, మత కట్టడాలకు ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్మాణ పనులు కొనసాగిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే దారులు షిఫా నుండి అక్కన్నమాదన్న దేవాయల మార్గంలో గుర్తించిన ఆస్తులకు నష్ట పరిహారం అందించి, రోడ్డుకు ఇరువైపులా నిర్మాణాలను తొలగించే పనులను పూర్తి చేస్తున్నామని తెలిపారు.