సిటీబ్యూరో, జూలై 10 (నమస్తే తెలంగాణ ): జీహెచ్ఎంసీ పరిపాలన పరమైన అంశాల్లో మార్పులు చేశారు. ఉద్యోగుల రిటైర్డ్మెంట్ బెనిఫిట్స్, పింఛన్ వంటి అంశాల్లో కమిషనర్‌కు ఉన్న అధికారాలను (అడ్మిన్), అడిషనల్ కమిషనర్ (ఫైనాన్స్)కు బదలాయించారు. దీంతో పాటు టౌన్‌ప్లానింగ్ విభాగంలోని ఇన్స్టంట్ రిజిస్ట్రేషన్, ఇన్స్టంట్ అఫ్రూవల్ విషయంలో నిర్ణీత సమయంలో సరైన డాక్యుమెంట్లు సమర్పించకపోతే ఆ పర్మిషన్ను రద్దు చేసే అధికారం ఇప్పటి వరకు కమిషనర్‌కు మాత్రమే ఉంది. దీన్ని జోనల్, డిప్యూటీ కమిషనర్లకు కట్టబెట్టారు. వీటితో పాటు హైడ్రాకు బుద్ధభవన్‌ను లీజుకు ఇచ్చారు.
గతంలో ఈవీడీఎం జీహెచ్ఎంసీకి చెందినది కావడంతో ఎలాంటి అద్దె వసూలు చేయలేదు. ఐతే హైడ్రా స్వతంత్ర సంస్థ ఏర్పాటు చేసిన తరుణంలో బుద్ధ భవన్‌కు సంబంధించిన అద్దెను జీహెచ్ఎంసీకి హైడ్రా చెల్లించాల్సి ఉంటుంది. తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సికింద్రాబాద్‌కు జూలై 19, 2025 నుంచి 18 జూలై 2028 వరకు 3 సంవత్సరాల వరకు, తూర్పు వైపు ఉన్న (ఎస్ఎఫ్టీ7110), నార్త్ వైపు ఉన్న 2500 ఎస్ఎఫ్టీ ని ఆగస్టు 20, 2025 నుంచి ఆగస్టు 19, 2028 వరకు, సౌత్ వైపు ఉన్న పోర్షన్ 2020 ఎస్ఎఫ్టీని, జూలై 1, 2025 నుంచి జూన్ 30, 2028 వరకు బుద్ధ భవన్ 4వ అంతస్తులో ఉన్న ప్రభుత్వం నిర్దేశించిన మేరకు లీజు ఇవ్వనున్నారు.
వీటితో పాటు బుద్ధ భవన్లో హైడ్రా కార్యాలయానికి జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారంగా ప్రభుత్వ ఉత్తర్వు నెంబర్ 25 తేదీ 30-01-2018 అనుసరించి 3 సంవత్సరాల పాటు 19-08-2024 నుంచి 18-08-2027 వరకు లీజుకు ఇవ్వనున్నారు. ఈ మేరకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం ఐదో స్టాండింగ్ కమిటీ సమావేశం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూంలో జరిగింది. కమిటీ సమావేశంలో 14 అంశాలు, రెండు టేబుల్ ఐటమ్లకు సభ్యులు ఆమోదించినట్లు మేయర్ తెలిపారు.
ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, స్టాండింగ్ కమిటీ సభ్యులు బొంతు శ్రీదేవి, బానోతు సుజాత, సమీనా బేగం, అబ్దుల్ వాహెబ్, ఫర్వీన్ సుల్తానా, డా.ఆయేషా హుమేరా, మహమ్మద్ సలీం, బాత జబీన్, మహాలక్ష్మి రమన్ గౌడ్, సి.ఎన్.రెడ్డి, మహమ్మద్ బాబా ఫసియుద్దీన్, జగదీశ్వర్ గౌడ్, బూరుగడ్డ పుష్ప , జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్లు రఘు ప్రసాద్, సత్యనారాయణ వేణుగోపాల్, సుభద్ర, పంకజ, గీతా రాధిక, మంగతాయారు, జోనల్ కమిషనర్లు హేమంత్ కేశవ్ పాటిల్, హేమంత్ సహదేవ్ రావు, అపూర్వ్ చౌహాన్, రవి కిరణ్, వెంకన్న, సీసీపీ శ్రీనివాస్, సీఈలు కోటేశ్వర రావు, సహదేవ్ రత్నాకర్, అకౌంట్ ఎగ్జామినర్ వెంకటేశ్వర్ రెడ్డి, భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాము నాయక్ సహాయ ఎస్టేట్ అధికారి ఉమా ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
అన్నపూర్ణ క్యాంటీన్లను ఇందిరా క్యాంటీన్లుగా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 5లకే అల్పాహార పథకాన్ని తీసుకువచ్చేందుకు అధికారులు ప్రతిపాదనలు పెట్టగా…స్టాండింగ్ కమిటీ సభ్యులు విస్తృతంగా చర్చ జరిపారు. పేరు మార్చారే కానీ నిర్వహణ ఏ మాత్రం బాగా లేదని సభ్యులు అభ్యంతరం చేశారు. ఇందిరా క్యాంటీన్లు అపరిశుభ్రంగా ఉండడం, పారిశుధ్య నిర్వహణ సరిగా లేదని కొందరు సభ్యులు మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. తాగునీరు, ఇతర సదుపాయాలు సరిగా లేవన్నారు. గతంలో కంటే భోజనం సరిగా ఉండడం లేదని, నాణ్యత లేని భోజనం పెడుతున్నారని సభ్యులు ఆరోపించారు.
మేయర్ సైతం ఒకానొక దశలో ప్రస్తుతం నిర్వహిస్తున్న హరేకృష్ణ ఫౌండేషన్‌కు కాకుండా కొత్త వారికి అవకాశం కల్పించాలని సూచించారు. టెండర్ ప్రక్రియ ద్వారా కొత్త వారికి అల్పహార పథకం ఇస్తే బాగుంటుందన్న చర్చ జరిగింది. చివరగా ప్రస్తుతం ఉన్న హరేకృష్ణ ఫౌండేషన్‌కు అప్పగించాలని, కాకపోతే నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని, లేదంటే సంబంధిత కాంట్రాక్ట్ రద్దు చేసేలా నిబంధనలు ఉండాలని సభ్యులు చెప్పడంతో ఆమోదం తెలిపారు.