సిటీబ్యూరో, జూన్ 30 (నమస్తే తెలంగాణ): వరుస వర్షాలకు తోడు సీజనల్ ముంచుకొస్తుంటే.. మరోవైపు ప్రభుత్వ దవాఖానాల్లో మందుల కొరత వైద్యులను, రోగులను కలవరపెడుతోంది. వాతావరణంలో మార్పులు ఏర్పడటంతో సీజనల్ వ్యాధులు విస్తరిస్తున్నాయి. రాబోయే రోజుల్లో సీజనల్ వ్యాధుల బారిన పడే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నప్పటికీ సర్కార్ ప్రిపేర్ అయి ఉండకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గ్రేటర్ పరిధిలో మొత్తం 292 బస్తీ దవాఖానలు, 14 ఏరియా హాస్పిటల్స్, మూడు జిల్లా దవాఖానలు, 135 ప్రాథమిక, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. వీటితో పాటు ఉస్మానియా, గాంధీ వంటి మరో 10 ట్రెషరీ హాస్పిటల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులోని చాలా దవాఖానల్లో సరిపడా మందులు లేక రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు.
జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలతో సర్కార్ దవాఖానాకు వెళ్లిన రోగులకు వైద్యులు మూడు లేదా ఐదు రోజుల కోర్సుతో ప్రిస్క్రిప్షన్ రాస్తే, అక్కడి ఫార్మసీ సిబ్బంది మాత్రం రెండు లేదు మూడు రోజులకే ఇస్తున్నట్లు రోగులు వాపోతున్నారు. అంతేకాకుండా ఇచ్చే మందుల్లో కూడా సగానికి పైగా లేవని.. బయట ప్రైవేట్ ఫార్మసీలలో తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని రోగి సహాయకులు ఆరోపిస్తున్నారు.
మందుల కొరత సమస్య అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో నెలకొన్నప్పటికీ.. బస్తీ దవాఖానల్లో ఈ సమస్య తీవ్రత అధికంగా ఉన్నట్లు రోగులు వాపోతున్నారు. దీనికి ప్రధాన కారణం బస్తీ దవాఖానల కోసం ప్రత్యేకంగా మందులు కేటాయించకపోవడం. ఆయా క్లస్టర్ల పరిధిలో ఉన్న పీహెచ్సీలు, యూపీహెచ్సీలకు మాత్రమే ప్రతి 3 నెలలకు ఒకసారి మందులను మంజూరు చేస్తున్నారు. పీహెచ్సీలకు కేటాయించే మందుల్లోనే బస్తీ దవాఖానలకు కూడా పంపిణీ చేయాల్సి రావడంతో రెండుచోట్లా మందుల కొరత తలెత్తుతోందని సిబ్బంది చెబుతున్నారు.
వర్షాలతో ఒక పక్క సీజనల్ ముంచుకొస్తుండగా మరో పక్క దవాఖానల్లో సరిపోను మందులు లేకపోవడంతో రోగులకు సమాధానం చెప్పలేక వైద్యులు, సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. స్థానిక ఆరోగ్య కేంద్రాలతో పాటు ఇతర ప్రభుత్వ దవాఖానల్లో మందులు సరఫరా చేసే ఏజెన్సీలకు బిల్లులు చెల్లించకపోవడంతో వారు మందుల సరఫరా నిలిపివేయడంతో సమస్య మరింత జఠిలంగా మారుతోందని అధికారవర్గాలు తెలిపాయి. సీజనల్ను దృష్టిలో పెట్టుకుని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన, సరిపడా మందులు, ఇతర సౌకర్యాలను సమకూర్చాల్సిందిగా రోగులు కోరుతున్నారు.