మేడ్చల్, ఆగస్టు 25, (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ చేయాలని జిల్లా కలెక్టరేట్‌కు రైతులు తరలివచ్చారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ రైతు సహకార సంఘం పరిధిలో ఉన్న 1189 మంది రైతులలో ఏ ఒక్కరికీ రుణమాఫీ చేయలేదని రైతులు ట్రాక్టర్ల ర్యాలీతో జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించారు. పలుమార్లు రుణమాఫీ కోసం అధికారులను కలిస్తే కళ్లబొల్లి మాటలు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారని ఆరోపించారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగొచ్చి రుణమాఫీ చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ద్రోహిగా మారిందని రైతుల ఆరోపించారు. అయితే రుణమాఫీ కోసం అధికారులను కలిసిందేకు కలెక్టరేట్ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించిన రైతు రుణమాఫీ సాధన సమితి సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కలెక్టరేట్ ప్రధాన గేటు వద్దే బైఠాయించి రైతులు ధర్నా నిర్వహించారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న క్రమంలో పోలీసులు అధికారులకు వినతి పత్రం అందించేందుకు అనుమతిచ్చారు. దీంతో రైతులు అదనపు కలెక్టర్ రాధికాగుప్తాకు రుణమాఫీ తక్షణమే చేయాలని వినతి పత్రం అందించారు. కలెక్టరేట్‌కు వచ్చిన వారితో రైతు రుణమాఫీ సాధన సమితి నాయకులు సుదర్శన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, పోషిరెడ్డి, కొమ్మిడి శోభారాణి, మహిపాల్‌రెడ్డి, సంజీవరెడ్డి, దామోదర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, మహేశ్వర్‌గౌడ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, బొడిగే శ్రీనివాస్‌గౌడ్‌లు ఉన్నారు.
జిల్లా అంతటా ఇదే పరిస్థితి
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా అనేక మంది రైతులకు రుణమాఫీ కాలేదు. రుణమాఫీ పొందని రైతులు సహకార సంఘాలలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించడంతో దరఖాస్తులు చేసుకున్నా ఇప్పటి వరకు రుణమాఫీ జరగలేదని రైతులు పేర్కొంటున్నారు. 10 శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.