సిటీబ్యూరో, మార్చ్17(నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం రూ.9లక్షల విలువైన 76.77గ్రాముల కొకైన్, 200 గ్రాముల ఓజీకుష్ను రెండు కేసుల్లో స్వాధీనం చేసకున్నారు. సుచిత్ర సర్కిల్ రూట్ వాజ్ నిర్వహించిన పోలీసులు 76.77 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నామని, కొకైన్‌తో పాటు ఒక కారును సీజ్ చేస్తూ ఈ కేసులో ఇన్జోత్సింగ్ నాగ్‌పాల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఫయాజుద్దీన్ తెలిపారు.
ఈ కొకైన్‌ను ముంబైలోని బోబ్రిలీకేఫ్ వద్ద అబ్డుజ్ అనే వ్యక్తి నుంచి తీసుకున్నట్లు విచారణలో నిందితుడు తెలిపారని పోలీసులు చెప్పారు. మన్‌ప్రీత్ సింగ్ అనే వ్యక్తి టెలిగ్రామ్ యాప్ ద్వారా ఓజీకుష్ను తెప్పించి విక్రయిస్తున్నాడనే సమాచారం మేరకు హస్మత్‌పేట్ డీటీఎఫ్ సీఐ నర్సిరెడ్డి సిబ్బంది కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మన్‌ప్రీత్‌సింగ్ వద్ద 260 ఓజీకుష్ (హైబ్రిడ్ గంజాయి)ని స్వాధీనం చేసుకున్నారు. ఓజీకుష్ను తమిళనాడులోని పాట్యాల అనే వ్యక్తి సరఫరా చేసినట్లు నిందితుడు వెల్లడించారని పోలీసులు తెలిపారు.