అవినీతికి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కేరాఫ్‌గా మారింది. నాలుగు రోజుల క్రితం జిల్లాలోని యూఎల్సీ విభాగానికి చెందిన డిప్యూటీ కలెక్టర్ వంశీమెహన్ను ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు నిర్ధారించి ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఘటన మరువక ముందే జిల్లాలోని శామీర్‌పేట్ తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన దాడుల్లో తహసీల్దార్ సుచరిత డ్రైవర్ ద్వారా రూ. 2 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడింది. శామీర్‌పేట్ మండలం అలియాబాద్ ప్రాంతంలో 30 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించి భూమి యజమానుల నుంచి ఎకరాకు రూ. లక్ష చొప్పున రూ. 30 లక్షలు డిమాండ్ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
– మేడ్చల్, మే 26 (నమస్తే తెలంగాణ)
కీలక పత్రాలైన భూ అనుమతులకు సంబంధించి రికార్డులను స్వాధీనం చేసుకుని తహసీల్దార్ సుచరితతో పాటు కీసర ఆర్డీవో రాజేశ్‌ను విచారించారు. రెండేళ్లలో 13 మందికి పైగా అధికారులు, ఉద్యోగులు ఏసీబీ అధికారులకు పట్టుబడటంపై సర్వత్రా చర్చ జరుగుతుంది. వరుసగా పట్టుబడుతున్న అధికారుల, ఉద్యోగుల్లో తీరు మారడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. డబ్బు ముట్టనిదే పనులను చేయకపోవడంతో అధికారుల తీరుపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు వెళ్తున్నాయి.
ఏసీబీ అధికారులకు ఉద్యోగులు పట్టుబడుతున్న అవినీతి మాత్రం తగ్గడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2025-మే నెలలో తూకుంట మున్సిపల్ కార్యాలయంలో బిల్‌కలెక్టర్లుగా విధులు నిర్వహించే శ్రావణ్, రాంరెడ్డిలు ఇంటి నంబర్‌ను కేటాయించే విషయమై రూ. 25 వేలు డిమాండ్ చేసిన నేపథ్యంలో ఏసీబీకి పట్టుబడ్డారు. శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్ఐ 2025 మార్చిలో ఏసీబీకి పట్టుబడగా 2024 ఫిబ్రవరి 13న శామీర్‌పేట్ తహసీల్దారు సత్యనారాయణ పట్టాదారు పాసుపుస్తకం ఇచ్చేందుకు రూ. 20 లక్షలు లంచం డిమాండ్ చేసి రెడ్ హ్యాండెడ్గ్ పట్టుబడి అరెస్టయ్యారు.
గతంలో మున్సిపాలిటీలుగా దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ రాజమల్లయ్య బిల్లుల చెల్లింపులపై రూ. 50 వేలు లంచం డిమాండ్ చేసిన క్రమంలో 2024 జూలై 22న ఏసీబీ అధికారులకు చిక్కగా నాగారం మున్సిపల్లో డీఈ రఘు, వర్క్ ఇన్స్పెక్టర్లు సురేశ్, రాకేశ్‌లు 2025 ఏప్రిల్ 19 పట్టుబడ్డారు. 2024-జూన్ 21న సూరారం పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ వెంకటేశం భూ వ్యవహరంలో రూ. లక్ష లంచం తీసుకుంటుండగా పట్టుబడి అరెస్టయ్యారు. 2024- అక్టోబర్ 8న మేడ్చల్ పోలీస్‌స్టేషన్ ఏఎస్ఐ మధుసూదన్‌రావు యాక్సిడెంట్ కేసు విషయంలో రూ. 50 వేలతో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఇటీవల కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయంలో టాక్స్ విభాగంలో విధులు నిర్వహించే వహిద్ పై ఏసీబీ అధికారులు దాడులు చేయగా ఉన్నతాధికారులు విధుల నుంచి సస్పెండ్ చేశారు.
లక్షల్లోనే లంచాలు..
జిల్లాలో ప్రధానంగా రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, రిజిస్ట్రేషన్ శాఖలు అవినీతిగా మారిపోయాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ కావాలంటే అదనంగా డబ్బులు ఇవ్వాల్సిందే. అల్వాల్ మండలంలో నిషేధిత భూములైన 582, 583 సర్వే నంబర్లలో లక్షల్లో లంచాలు తీసుకుని రిజిస్ట్రేషన్లు చేయగా, ఇద్దరు సబ్రిజిస్ట్రార్లను సస్పెండ్ చేసిన విషయం విదితమే. గతేడాది నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లి, లక్ష్మీనగర్, శేషాద్రినగర్, శ్రీదేవినగర్లకు చెందిన కాలనీల్లో సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లు చేశారు. ఇదే శామీర్‌పేట్ కార్యాలయంలో రెండేళ్లలో ఇద్దరు తహసీల్దార్లు లక్షల్లో డిమాండ్ చేసి ఏసీబీ అధికారులకు పట్టుబడటం గమనార్హం.