GHMC | సిటీబ్యూరో : పాలకమండలి వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల గొంతునొక్కింది. గురువారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన 10వ సర్వసభ్య సమావేశంలో వారిని సభ ఘోరంగా అవమానించింది. జీహెచ్ఎంసీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మెజార్టీ సభ్యులున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సస్పెండ్ చేసి.. మార్షల్స్‌తో బలవంతంగా సభ నుంచి బయటకు పంపించేశారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా బడ్జెట్‌పై ఎలాంటి చర్చ జరగకుండానే ఆమోదిస్తున్నట్లు మేయర్ ప్రకటించి.. అన్ని పార్టీలను విస్మయానికి గురి చేశారు. ప్రజాస్వామ్య యుతంగా ప్రభుత్వ వైఖరిపై ప్రజాక్షేత్రంలో పోరాడుతున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లను అణగదొక్కే విధంగా సభ వ్యవహరించిన తీరుపై గ్రేటర్ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేయర్ అధ్యక్షతన పాలక మండలి సమావేశం ఉదయం 10.35 గంటలకు ప్రారంభమైంది.
10.37 నిమిషాలకు దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రముఖ వ్యాపార దిగ్గజం రతన్ టాటా మృతికి సంతాపంగా రెండు నిమిషాల పాటు సభ మౌనం పాటించి నివాళులర్పించింది. అనంతరం ఆర్థిక సంవత్సరం (2025-26)కు సంబంధించిన రూ.8440 కోట్ల బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టి అన్ని పార్టీల సభ్యులకు చర్చకు అవకాశం కల్పించాలి. అయితే మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాత్రం చర్చ జరగకుండానే బడ్జెట్‌ను ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. అంతకు ముందు ఆరు గ్యారంటీలను అమలు చేయాలని, హైదరాబాద్ నగరానికి సరిపడా నిధులను వెంటనే మంజూరు చేయాలని ఫ్లకార్డులతో బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసన తెలిపారు. దీంతో తొలుత నలుగురు కార్పొరేటర్లను జీహెచ్ఎంసీ అవతల ఉన్న వ్యాన్‌లో ఎక్కించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వీరిని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ హాల్లో మిగతా కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు.
పోడియం వద్దకు వెళ్లిన బీఆర్ఎస్ కార్పొరేటర్ల చేతిలో ఉన్న ప్లకార్డులను కాంగ్రెస్ కార్పొరేటర్లు సీఎన్ రెడ్డి, బాబా ఫసియుద్దీన్‌లు లాక్కుని చించేశారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు మహిళా కార్పొరేటర్లు అని చూడకుండా నెట్టేశారు. ఇదే అదనుగా సభ జరగకుండా అడ్డుకున్నారన్న కారణంతో మేయర్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ సెక్షన్ 89/1 ప్రకారం మార్షల్స్‌తో బీఆర్ఎస్ కార్పొరేటర్లను బయటకు తీసుకువెళ్లారు. కాగా, కౌన్సిల్ ప్రశ్నోత్తరాల సందర్భంగా అన్ని పార్టీల సభ్యులు సమస్యలపై ఏకరువు పెట్టారు. అధికార పార్టీ కార్పొరేటర్లే స్వయంగా ప్రజా సమస్యలు పెరిగిపోతున్నాయంటూ సభలో మేయర్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు.
పారిశుధ్య నిర్వహణ ఏ మాత్రం బాగులేదని, కోచ్‌లు లేక క్రీడారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని, వీధి దీపాలు లేక ప్రమాదాలు, దోపిడీలు పెరిగిపోయాయని, మురుగునీటి , నాలా సమస్యలతో ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నామని స్వయంగా డిప్యూటీ మేయర్ మొదలుకొని కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి, జగదీశ్వర్ గౌడ్ విమర్శించారు. కాగా, సర్వసభ్య సమావేశం సందర్భంగా జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని పోలీసులు తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. అంతేకాకుండా మార్షల్స్ బీఆర్ఎస్ కార్పొరేటర్లను హాల్ నుంచి బయటకు తీసుకువెళ్లే సమయంలో అత్యుత్సాహం ప్రదర్శించారు. మహిళా కార్పొరేటర్లు అని చూడకుండా వారిని బయటకు లాక్కుని వచ్చి వ్యాన్‌లోకి ఎక్కించారు.ఈ సందర్భంగా కొందరు మహిళా కార్పొరేటర్లకు స్వల్ప గాయాలయ్యాయి.