GHMC | సిటీబ్యూరో, జూన్ 10 (నమస్తే తెలంగాణ ) : ‘గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ప్రశాంత్‌హిల్స్‌లో సర్వే నంబర్ 66/2లో ప్లాట్ నంబర్ 178/పార్ట్‌లో జీ+4 అంతస్తులకు అనుమతి తీసుకొని ఏడు అంతస్తుల నిర్మాణం చేపట్టారు. సెడ్బ్యాక్ ఉల్లంఘన భారీగా జరిగింది. ఈ అక్రమ నిర్మాణాన్ని ఆపాలని జీహెచ్ఎంసీ జోనల్, ప్రధాన కార్యాలయంలోని టౌన్‌ప్లానింగ్ విభాగానికి ఫిర్యాదు చేశాం. ప్రజాభవన్‌లో ప్రజావాణికి ఫిర్యాదు చేశాం. ఫిర్యాదును పరిష్కరించిన పాపాన పోలేదు.
సదరు అక్రమ నిర్మాణంలో హాస్టల్ వచ్చేసింది. ఈ నిర్మాణంతో స్థానికంగా అనేక ఇబ్బందులు వస్తున్నాయి’ అంటూ గాయత్రి అనే మహిళ జీహెచ్ఎంసీ ప్రజావాణి వేదికగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ముందు కన్నీటి పర్యవంతమయ్యారు. ఏడాది కాలంగా ఆమె చేస్తున్న పోరాటం ఫిర్యాదుదారులను తీవ్రంగా కలిచివేసింది. స్పందించిన మేయర్.. సీసీపీ రాజేంద్రప్రసాద నాయక్ నుంచి రెండు రోజుల్లో సమగ్ర నివేదికను తెప్పించుకుని న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఒక్క గాయత్రే కాదు.. ఉప్పల్, ఇతర ప్రాంతాల నుంచి టౌన్‌ప్లానింగ్ అధికారుల అక్రమాలు, అనధికారిక నిర్మాణాలపై ప్రజావాణిలో ఫిర్యాదుదారులు గగ్గోలు పెట్టారు.
జీహెచ్ఎంసీలో విధులు నిర్వర్తించే సంబంధిత శాఖల అధికారులు ప్రజల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించడమే కాకుండా పొంతన లేని సమాధానాలతో కాలయాపన చేస్తున్నారని ప్రజావాణిలో ఫిర్యాదుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు జీహెచ్ఎంసీలో ప్రజలకు సమస్యలను సృష్టించేది అధికారులేనంటూ ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా టౌన్ ప్లానింగ్‌కు సంబంధించిన ఫిర్యాదులే అధిక సంఖ్యలో వచ్చాయి. అధికారులు సమస్యలను పరిషరించకుండా కాలయాపన చేస్తూ తనను అనారోగ్యం పాలు చేశారంటూ శేరిలింగంపల్లి జోన్ రాయదుర్గం ప్రాంతానికి చెందిన గాయత్రి ప్రజావాణిలో దరఖాస్తు చేస్తూ బోరున విలపించారు.
అక్రమ కట్టడాన్ని చేపడుతున్నారంటూ ఫిర్యాదు చేశానని.. చర్యలు తీసుకోవాలంటూ.. అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని చెప్పారు. పైగా అక్రమారులతో చేతులు కలిపిన టౌన్ ప్లానింగ్ అధికారులు.. అక్రమ కట్టడాలకు అండగా దగ్గరుండి కట్టడాలకు సహకరించారంటూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తనకు జరిగిన అన్యాయం పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ మేయర్, ఇన్చార్జి కమిషనర్ ఆమ్రపాలిని కోరారు. మొత్తంగా ప్రధాన కార్యాలయంలో 45 ఫిర్యాదులను అధికారులు స్వీకరించారు.
గ్రేటర్ హైద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజల సమస్యల పరిషారం కోసం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి దరఖాస్తుల వెల్లువలా వచ్చాయి. మూడు నెలలుగా రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల కోడ్ కారణంగా ప్రజావాణి నిలిచిపోయింది. ఈ నెల 6న కోడ్ ముగియడంతో సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. బల్దియా కమిషనర్ రొనాల్డ్ రాస్ వ్యక్తిగత సెలవు పై వెళ్లడంతో ఇన్చార్జి కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆమ్రపాలి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చినా..
సరైన పద్ధతిలో స్పందించడం లేదని చెప్పారు. తప్పులు చేసిన వారికి సహకరిస్తూ ఇబ్బందులు పడుతున్న వారికి అన్యాయం చేసే విధంగా అక్రమారులకు సలహాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారంటూ బాధిత ప్రజలు అధికారుల ముందు తమ గోడును చెప్పుకున్నారు. ఏండ్ల తరబడి అధికారుల దృష్టికి సమస్యలను తీసుకొచ్చినా.. జోనల్ ఆఫీస్, సరిల్ ఆఫీస్ ల చుట్టూ తిప్పడమే తప్ప ఎలాంటి ప్రయోజనం లేకుండా అధికారులు వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వర్షాకాలం ప్రారంభం అయినా ఇప్పటికీ నాలాల్లో వ్యర్థాలను తొలగించలేదని, ప్రజావాణిలో మేయర్‌కు బీజేపీ కార్పొరేటర్ ఫిర్యాదు చేశారు.
మేడ్చల్, సిటీబ్యూరో: ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని హైదరాబాద్ జిల్లా రెవెన్యూ అధికారి వెంకటాచారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో 62 దరఖాస్తు వచ్చినట్లు తెలిపారు. మేడ్చల్ కలెక్టరేట్లో ప్రజల నుంచి 90 దరఖాస్తులను స్వీకరించారు.