సిటీబ్యూరో, ఏప్రిల్ 27(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ కేంద్రంగా పలువురి ఐఏఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. జీహెచ్ఎంసీతోపాటు, హెచ్ఎండీఏ, ఫ్యూచర్ సిటీ అథారిటీకి అధికారులను నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. జాబితాలో జీహెచ్ఎంసీ కమిషనర్, హెచ్ఎండీఏ సెక్రటరీ, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లతోపాటు, హైదరాబాద్ జిల్లాకు అదనపు కలెక్టర్లు కూడా ఉన్నారు. ప్రభుత్వం వెల్లడించిన జాబితాలో హెచ్ఎండీఏ సెక్రటరీగా ఉపేందర్ రెడ్డిని నియమించగా.. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఉన్న ఇలంబర్తిని బదిలీ చేస్తూ ఆయన బాధ్యతలను ఆర్వీ కర్ణన్‌కు అప్పగించింది.
ఇలంబర్తిని పట్టణాభివృద్ధి కార్యదర్శిగా నియమించింది. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్‌గా హేమంత్ సహదేవ్‌రావు, హైదరాబాద్ అదనపు కలెక్టర్‌గా విద్యాసాగర్‌ను నియమించగా, కొత్తగా ఏర్పాటైన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్‌గా శశాంక నియమితులయ్యారు. పట్టణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా ఉన్న దానకిశోర్‌ను కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించగా, ఆయన స్థానాన్ని ఇద్దరు ఐఏఎస్ అధికారులతో భర్తీ చేసింది. అయితే ఇటీవలే హెచ్ఎండీఏ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన గంగాధర్‌ను అంతలోనే బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది.
గ్రేటర్లో కీలకమైన శాఖ ఏదైనా ఉందని అంటే అది జీహెచ్ఎంసీ మాత్రమే.. అలాంటి శాఖకు కమిషనర్‌గా పట్టుమని రెండేళ్లు సైతం ఎవరూ ఉండడం లేదు. కమిషనర్ రోనాల్డ్‌రోస్ బల్దియాపై పట్టు సాధించి గాడిలో పెట్టే సమయంలోపే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంధనశాఖకు బదిలీ చేసింది.
తర్వాత వచ్చిన కమిషనర్ ఆమ్రపాలి క్యాట్ (సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యూనల్) ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వంలో రిపోర్టు చేశారు. నాలుగు నెలల్లోపే ఆమె జీహెచ్ఎంసీనే కాదు రాష్ర్టాన్ని వీడాల్సి వచ్చింది. గతేడాది అక్టోబరు 17న జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఇలంబర్తి బాధ్యతలు తీసుకున్నారు. శాఖలవారీగా పట్టు సాధించి ఆర్థిక, శానిటేషన్ విభాగాన్ని గాడిలో పెడుతూ వచ్చారు. 8 నెలలు గడవ ముందే ఇలంబర్తిని పురపాలక శాఖ సెక్రటరీ(హెచ్ఎండీఏ లిమిట్)గా బదిలీగా చేశారు.