ఖైరతాబాద్, డిసెంబర్ 11 : దేశ సందపను బడా బాబులకు దోచిపెడుతున్న అంశాన్ని ప్రశ్నిస్తున్నందుకే కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలతో తెలంగాణపై దాడులు చేయిస్తోందని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్రంపై ఆయన నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఓరుగంటి వెంకటేశం గౌడ్‌తో కలిసి మాట్లాడారు. బీజేపీ ఓ నియంతలా వ్యవహరిస్తున్నదని, దర్యాప్తు సంస్థలన్నీ కేంద్రానికి ఏజెంట్లా మారాయని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఒక్కో సీఎం వద్ద రూ.50వేల కోట్లు, అక్కడి మంత్రులకు సైతం వేలాది కోట్ల ఆస్తులు ఉన్నాయన్నారు. వారిపై ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. 2014లో అంబానీ, అదానీ ఆస్తులెంత ?ఇప్పుడెంతో చెప్పాలని, వాటిపై ఎందుకు విచారణ జరిపించడం లేదన్నారు. ఈ సంస్థలలో 50 శాతం వాటా అమిత్‌షాకు వెళ్తున్నదని విమర్శించారు.
సింగరేణిలో నాలుగు భాగాలు అమ్మేశారు..
దేశానికి సంపదనిస్తున్న సింగరేణిలో 51 శాతం వాటా రాష్ర్టానిదేనని చెప్పిన ప్రధాని మోదీ ఢిల్లీకి వెళ్లిన వెంటనే సింగరేణి సంస్థల నాలుగు బ్లాకులను ప్రైవేటీకరణ చేశారన్నారు. దేశంలో ఇప్పటి వరకు 140 సంస్థలను ప్రైవేట్‌పరం చేశారని, ఫలితంగా లక్షల మంది కార్మికులు రోడ్లపై పడే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ దేశ యువతకు ఉద్యోగాలు లేవని, ప్రధాని హోదాలో ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇంత వరకు ఇవ్వలేదన్నారు. ఇక్కడ సీఎం కేసీఆర్ లక్షల ఉద్యోగాలు ఇస్తుంటే ఓర్వలేక బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
బండి సంజయ్‌కు 700 కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి..
ఎంపీగా గెలిచిన మూడేండ్లలోనే బండి సంజయ్ 7 వందల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించాడని గజ్జెల కాంతం ప్రశ్నించారు. బండి సంజయ్ గ్రానైట్, ఇతర వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. బండి సంపాదనపై ఇన్‌కం ట్యాక్స్, సీబీఐ, ఈడీలతో ఎందుకు విచారణ చేయడం లేదని, త్వరలోనే సాక్ష్యాలతో సహా బయటపెడతానని గజ్జెల కాంతం అన్నారు. మధ్యప్రదేశ్, కర్నాటక, ఉత్తర ప్రదేశ్, గోవాలో లక్షల కోట్ల దోపిడీ జరుగుతున్నా..అక్కడ దాడులు చేయరని విమర్శించారు.
2024లో ప్రధాని కేసీఆరే…
భారత దేశానికి కొత్త నాయకత్వం అవసరమని, అది తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్తో సహా అన్ని పార్టీలను ఏకం చేసి ప్రధానిగా కేసీఆర్ ఎన్నికవుతారన్నారు. ఎప్పుడూ ఈడీ, సీబీఐలు మీ దగ్గర ఉండవని, అదే దర్యాప్తు సంస్థలతో బీజేపీ నేతలపై విచారణ జరిపిస్తామన్నారు. ఈ దేశ ప్రజలు బాగుపడాలన్నా, యువతకు ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్ ప్రధాని అవ్వాలన్నారు.