మేడ్చల్, జూలై 16(నమస్తే తెలంగాణ)/అల్వాల్: బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చేసిన దౌర్జన్యం, దాడులపై మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. అల్వాల్‌లో బోనాల చెక్కుల పంపిణీలో ప్రొటోకాల్ వివాదం జరిగి కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నేతలపై చేసిన దాడిపై బుధవారం మర్రి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకుల, కార్యకర్తల జోలికి వస్తే ప్రతిఘటిస్తామని, వారి న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తామని స్పష్టం చేశారు. బోనాల పండగ నిర్వహణ కోసం చెక్కుల పంపిణీ చేస్తున్న క్రమంలో అది కూడా రాజకీయం చేసి గొడవ సృష్టించారని మండి పడ్డారు. బీఆర్ఎస్ నేతలపై జరిగిన దాడులపై ఆధారాలతో ఫిర్యాదు చేయనున్నట్లు మర్రి రాజశేఖర్‌రెడ్డి వెల్లడించారు.
అధికార పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అభివృద్ధిపై దృష్టి సారించాలని, అర్హులైన నిరు పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రాజీవ్ యువ వికాసం పథకాలను అందించే విధంగా కృషి చేయాలే తప్ప.. దాడులకు ప్రోద్బాలం అందించ వద్దని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు మైనంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేశారని ప్రశ్నించారు. విపక్ష ఎమ్మెలేగా ఉన్న తాను ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తేస్తే ఏదో విధంగా అడ్డు పడుతున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో అన్యాయాలను, అక్రమాలు, భూ కబ్జాలను మైనంపల్లి హన్మంతరావు అడ్డుకోవాలని సూచించారు. పార్టీ అధికారంలో ఉన్నందున ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టాలని, బీఆర్ఎస్ నాయకులపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడవద్దన్నారు. 53 వేల మెజార్టీతో గెలిపించిన మల్కాజిగిరి నియోజకవర్గ అభివృద్ధి చెద్దామంటే కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారని, అధికార యంత్రాంగాన్ని సైతం తప్పుదోవ పట్టిస్తున్నారని మర్రి రాజశేఖర్‌రెడ్డి ఆరోపించారు.
అల్వాల్‌లో జరిగిన కాంగ్రెస్ నాయకులు జరిపిన దాడి ఘటనపై బుధవారం బీఆర్ఎస్ నేతలలో మర్రి రాజశేఖర్‌రెడ్డి కలిసి డీజీపీ డాక్టర్ జితేందర్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతికు ఫిర్యాదు చేశారు. ప్రొటోకాల్ ఉల్లంఘన, కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిని వివరించారు.
మల్కాజిగిరి నియోజకవర్గంలోని అల్వాల్‌లో చోటు చేసుకున్న ఘటన నేపథ్యంలో బోయిన్‌పల్లిలోని మర్రి రాజశేఖర్‌రెడ్డి కార్యాలయం వద్ద పోలీస్ పికెట్‌ను ఏర్పాటు చేశారు. ఉద్రిక్తత నేపథ్యంలో మల్కాజిగిరి నియోజకవర్గ పర్యటనకు వెళ్లకుండా పోలీస్ పికెట్‌ను ఏర్పాటు చేసి అడ్డుకున్నారు.