మేడ్చల్, జూలై 9(నమస్తే తెలంగాణ): మల్కాజిగిరి నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల సర్వే నంబర్లను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చి రిజిస్ట్రేషన్లను నిలిపివేసిన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించేలా మల్కాజిగిరిలో త్వరలో నిర్వహించే భారీ ధర్నా కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను గురువారం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ 22ఏ నిషేధిత జాబితా కారణంగా వేలాది మంది పేద, మధ్య తరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. తమ సొంత ఆస్తులను కొనుగోలు చేయడం, విక్రయించినా రిజిస్ట్రేషన్లు సాధ్యం కాక ప్రజలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.