జవహర్‌నగర్, జనవరి 28: పాఠశాల దేవాలయం లాంటింది.. సమాజ భవిష్యత్తుకు పునాది రాయిలాంటిది.. అలాంటిది చెన్నాపురం పాఠశాల రోడ్డు విస్తరణలో పోతుందంటే.. పూర్వ విద్యార్థులు, జవహర్‌నగర్ వాసులు బడిని కాపాడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. 1964లో ఏర్పడిన చెన్నాపూర్ ప్రాథమిక పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థానాల్లో సేవలందిస్తున్నారు. పాఠశాల చెన్నాపూర్ ఊరిలో లేకుంటే చెన్నాపూర్ అస్థిత్వం సమసిపోతుందని చెన్నాపూర్ వాసులు అంటున్నారు. 60 ఏండ్ల నాటి బడిని కూల్చొద్దని వేడుకుంటున్నారు.
ఉన్నత స్థానాల్లో విద్యార్థులు..
చెన్నాపూర్ పాఠశాల గదులు కుంగిపోయి.. ఒకే ఒక్క రూము ఉండటంతో అందులోనే ఐదు తరగతులకు సంబంధించిన విద్యార్థులకు బోధన చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మనబడి పథకంతో పాఠశాలను బలోపేతం చేస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం సర్కారు బడులను నిర్వీర్యం చేస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 100 ఫీట్ల రోడ్డు విస్తరణ చేస్తుండగా చెన్నాపూర్ పాఠశాల పూర్తిగా పోతుంది. పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థానాల్లో సేవలందిస్తున్నారు. చదువుతోనే దేశ భవిష్యత్తు మార్చగలమని.. చెన్నాపూర్ బడిలో విద్యాభ్యాసం చేసిన పూర్వవిద్యార్థులు పాఠశాలను కూల్చవద్దని.. ప్రభుత్వం స్థలం కేటాయించి విశాలమైన పాఠశాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
ఒకే గదిలో ఐదు తరగతులు..
చెన్నాపూర్ పాఠశాలలో సుమారు 70మంది విద్యార్థులు చదువుతున్నారు. ముగ్గురు ఉపాధ్యాయులు ఉండగా… ఒకే గదిలో ఐదు తరగతులకు బోధన చేయడం కష్టంగా మారింది. ఒకరికి క్లాసులు చెబుతుండగా… మరో క్లాసు విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. ఆట స్థలం లేకపోవడంతో చిన్నారులకు మానసిక, శారీరక ఎదుగుదల లేకుండా పోయింది.
ఈ బడిలోనే చదివా.. సేవ చేస్తున్నా..
చెన్నాపూర్ ప్రభుత్వ బడిలో చదువుకుని జవహర్‌నగర్‌కు మూడు సార్లు సర్పంచ్‌గా ఎన్నికయ్యా.. ప్రజలకు మెరుగైన సేవలందించా. పూర్తిగా పేద ప్రజలు నివసించే జవహర్‌నగర్‌కు గతంలో చెన్నాపూర్ పాఠశాలే కార్పొరేట్ పాఠశాలగా ఉండేది. ఈ బడిలో చదువుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. చదువుతోనే జీవితం మారుతుంది.
– శంకర్‌గౌడ్, మాజీ సర్పంచ్ జవహర్‌నగర్
గ్రిల్స్ పెట్టుకొని బోధిస్తున్నాం
100 ఫీట్ల రోడ్డు విస్తరణలో చెన్నాపూర్ పాఠశాల పోతుందని ఇప్పటికే అధికారులు మార్కింగ్ చేశారు. అసలే ఒకే రూములో గ్రిల్స్ పెట్టుకుని విద్యార్థులకు బోధన చేస్తున్నాం. క్రీడా మైదానాలు లేకపోవడంతో కాలనీ రోడ్లపై చిన్నారులకు ఆటలు ఆడిస్తున్నాం. పాఠశాల పూర్తిస్థాయిలో పోతుంది… విద్యార్థులకు చదువు చెప్పడం కష్టంగా మారుతుంది. పాఠశాలకు స్థలం కేటాయించాలి.
– కమల వాసిని ఉపాధ్యాయురాలు
కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తా..
చెన్నాపూర్ పాఠశాల ఒకే గదిలో కొనసాగుతుంది. మార్కింగ్ చేసిన ప్రకారం… కొంతమేర మాత్రమే మిగులుతుంది. ఒకే గదిలో ఐదు తరగతులు కొనసాగడం కూడా కష్టంగా ఉంది. నష్టపరిహారం చెల్లించేది కూడా మాకు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. త్వరలోనే కలెక్టర్, డీఈవో దృష్టికి తీసుకెళ్తా..పాఠశాలకు స్థలాన్ని కేటాయిస్తేనే పేద విద్యార్థులకు న్యాయం జరుగుతుంది.
– బాపురెడ్డి, కాప్రా ఎంఈవో