బడంగ్‌పేట, నవంబర్ 11 : గంజాయి ముఠా గుట్ట రట్టు చేసినట్లు మహేశ్వరం డీసీపీ సునీతా రెడ్డి తెలిపారు. సోమవారం పహాడీషరీఫ్ పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ మాట్లాడుతూ.. బడంగ్‌పేట పరిధిలోని సుల్తాన్పూర్ వద్ద బాలాపూర్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా.. రెండు కార్లు, నాలుగు ద్విచక్ర వాహనాలలో నిందితులు గంజాయి తరలిస్తున్నట్టు సమాచారం వచ్చిందన్నారు. నిందితులు వేర్వేరు ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్నట్టు గుర్తించారు. బాలాపూర్ పోలీసులు గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి యూరఫ్‌కు చెందిన 170 గ్రాముల ఓషన్ గాంజా (ఓజీ), తొమ్మిది కిలోల గంజాయి, నాలుగు సెల్ఫోన్లు, రూ.72.84 లక్షల విలువ జేసే సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ పేర్కొన్నారు. గంజాయి విక్రయిస్తున్న బండారి సునీల్, మహ్మద్ అస్లాం, మహ్మద్ అక్రమ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరిని విచారించడంతో.. మహ్మద్ ఇద్రిస్ కలీల్ అలియాస్ ఫర్హాన్, మహ్మద్ అబ్బాస్ కలిసి గంజాయిని రహస్యంగా సోషల్ మీడియా యాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ద్వారా కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. నిందితులు ఈ దందాను సోషల్ మీడియా ద్వారా నిర్వహిస్తున్నారు. ప్రధాన నిందితుడు దుబాయ్ పారిపోయాడన్నారు. అబ్బాస్‌ను అరెస్టు చేయడానికి ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్టు డీసీపీ తెలిపారు. అరెస్టు చేసిన నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఏసీపీ లక్ష్మీకాంత్‌రెడ్డి, బాలాపూర్ ఇన్స్పెక్టర్ సుధాకర్ తదితరులు ఉన్నారు.