దుండిగల్, జూన్ 23: విశాఖపట్నం నుంచి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా గంజాయి రావాణా చేస్తున్న వ్యక్తిని దుండిగల్ పోలీసులు అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడి నుంచి రూ.45 లక్షల విలువచేసే 120.17 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం దుండిగల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు.
ఈ నెల 22న ఏపీలోని విశాఖపట్నం నుంచి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా హర్యాన రాష్ర్టానికి గంజాయిని తరలిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న మేడ్చల్ ఎస్ఓటీ, దుం డిగల్ పోలీసులు సంయుక్తంగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ 5 (దుండిగల్ గేట్)వద్ద తనిఖీలు చేపట్టారు. సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో టాటా నెక్సాస్ కారు (ఏపీ 40, డీఎం8365) రాగా దాన్ని తనిఖీ చేయగా 43 ప్యాకెట్లలో 120.17 కిలోల గంజాయి లభించింది. దీని విలువ సుమారు రూ.45 లక్షల వరకు ఉంటుంది.
కారులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా.. తాను కర్ణాటక రాష్ట్రం, గుల్బర్గా జిల్లా, సేవాలాల్ మందిర్ ప్రాంతానికి చెందిన సాగర్ పవార్‌గా పేర్కొన్నారు. నిందితుడిని అరెస్ట్‌చేసి, గంజాయి, కారు, 5 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో నలుగురు నిందితులు దేవరాజ్, భజరంగ్, హనుమంతు పవార్, రాజకుమార్‌లు పరారీలో ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఓటీ డీసీపీ, ఏసీపీ, మేడ్చల్ ఏసీపీతో పాటు పలువురు సీఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.