దుండిగల్, జూలై 15: సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఓ సెక్యూరిటీ గార్డు గంజాయి దందాలోకి దిగి పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశాకు చెందిన శుభకంఠ జన రెండేండ్ల కిందట ఉపాధి కోసం నగరానికి వలసొచ్చి గాగిళ్లాపూర్‌లో ఓ గదిని అద్దెకు తీసుకొని ఉంటూ.. ప్రీమియర్ ఇంజినీర్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. వచ్చే జీతం సరిపోకపోవడంతో సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో తన స్నేహితుడి ద్వారా గంజాయిని విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. ఒడిశాలో ఉండే తన మిత్రుడు జిల్లు ద్వారా రూ.15 వేలకు 4 కిలోల గంజాయిని కొనుగోలు చేసి, గాగిళ్లాపూర్‌కు తీసుకువచ్చి తన గదిలో నిల్వ చేశాడు. తనకు తెలిసిన వ్యక్తి అమిత్‌కు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్ఓటీ పోలీసులు, దుండిగల్ పోలీసులతో కలిసి శుభకంఠ జన ఉంటున్న గదిని తనిఖీ చేయగా 3.8 కిలోల గంజాయి ప్యాకెట్లు లభించాయి. విచారణలో ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చినట్లు అంగీకరించాడు. కేసు నమోదు చేసిన దుండిగల్ పోలీసులు శుభకంఠ జనను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. మిగతా ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.