మేడ్చల్, నవంబరు 18: తెలంగాణ రాష్ట్రం సిద్ధించే క్రమంలో అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీ అలసత్వం వహించడంతో రాష్ట్రం కోసం ఎంతో మంది యువకులు ఆత్మాహుతి చేసుకున్నారు. వారి పని తీరు, వ్యవహార శైలిని చూసి నివ్వెరపోయిన యువత ప్రాణాలను తృణప్రాయంగా వదిలేశారు. బతుకు కంటే స్వరాష్ట్రమే ఎక్కువ అని భావించారు. రాష్ట్రం, కేంద్రంలో ఉన్న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వడంలో మీనమేషాల లెక్కిస్తుండటంతో యువత బలిదానాలకు సిద్ధపడ్డారు.
మేడ్చల్ ప్రాంతంలో శ్రీకాంత్, సురేశ్, దువ్వాసి కిషోర్ తదితరులు ఆత్మ బలిదానాలకు సిద్ధ పడ్డారు. అప్పుడు అధికారంలో ఉన్న కేంద్రమంత్రి చిదంబరం మూడు రోజుల కిందట హైదరాబాద్‌కు వచ్చి అప్పటి ఆత్మహత్యలకు సారీ చెబుతూ.. తమ ప్రభుత్వానిది బాధ్యత కాదని చెప్పడంపై అమరవీరుల కుటుంబాల సభ్యులు మండిపడుతున్నారు. తెలంగాణ కోసం వెలకట్టలేని తమ బిడ్డ ప్రాణాలు పణంగా పెడితే సారీ చెప్పి, తప్పించుకోవడం దారుణమని మండిపడ్డారు. అప్పట్లో డిసెంబర్ 9 తర్వాత తెలంగాణ ఇస్తామని ప్రకటించి, వెంటనే ఇచ్చి ఉంటే వందలాది మంది యువకుల ప్రాణాలు పోయేవి కావని, పూర్తి బాధ్యత కాంగ్రెస్‌దే అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
డిసెంబరు 9న తెలంగాణ ఇస్తున్నట్టు ప్రకటించిన కేంద్ర మంత్రి చిదంబరం ఆ తర్వాత ఆంధ్ర పాలకుల ఒత్తిడికి తలొగ్గి, మాట వెనక్కి తీసుకోవడం ప్రజల్లో అలజడి రేగింది. ప్రధానంగా యువత ఆక్రోశం పెరిగింది. రోడ్లపైకి వచ్చి రాస్తారోకోలు చేశారు. రైలురోకోలు చేశారు. వంటావార్పుతో హోరెత్తించారు. ఆంధ్ర పాలకులను అడ్డుకుకున్నారు. అయినా, కమిటీల పేరుతో తాత్సారం చేయడంతో ఓపిక నశించి, తమ బలిదానాలతోనైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో మార్పులు రావాలని కోరుకున్నారు.
మేడ్చల్ ప్రాంతంలో శ్రీకాంత్, సురేశ్, కిషోర్ సింగ్‌తో పాటు మరో యువకుడు తెలంగాణ బలవన్మరణానికి పాల్పడ్డారు. శ్రీకాంత్ రైలు కింద పడి చనిపోగా, సురేశ్ ఉరేసుకొని చనిపోయాడు. కిషోర్, మరో యువకుడు ఉరేసుకొని చనిపోయారు. ఉద్యమ నేతలను పోలీసులు చాలా ఇబ్బంది పెట్టారు. అరెస్ట్ చేయడం, ఇంట్లో నుంచి బయటకు రాకుండా చేయడం, ప్రాణం పోయేలా కొట్టడం లాంటి ఎన్నో చర్యలు తీసుకున్నా వెరవలేదు. కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో ఉద్యమంలో నిలబడ్డారు. ప్రస్తుత మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, నాయిని నర్సింహారెడ్డి తదితరులు ఉద్యమకారులకు అండగా నిలిచారు.
నా కొడుకును అన్యాయంగా బలిగొన్నరు. తెలంగాణ ఇస్తామని చెప్పి, ఇయ్యలేదు. అందరితో పాటు నా కొడుకు తెలంగాణ కోసం ఉద్యమంలో పాల్గొన్నడు. రోజూ అదే పనిగా పొద్దున పోవడం, రాత్రి రావడం చేస్తుండే వాడు. అందేంటి అట్ల తిరుగతున్నావంటే తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడుతయి అమ్మా.. అనే చెప్పేటోడు. కాంగ్రెసోళ్లు తెలంగాణ ఇస్తామని చెప్పి, మాట మార్చిండ్రు. కావాలనే ఇయ్యడం లేదని చెపుతుండేటోడు. రాస్తారోకో, రైలురోకో ఉద్యమాల్లో పాల్గొన్న నా కొడుకు శ్రీకాంత్ తెలంగాణ కోసం ఆ రైలు కిందనే పడి చనిపోయిండు. చెప్పినప్పుడు తెలంగాణ ఇచ్చి ఉంటే నా కొడుకు కాదు, ఎంతో కొడుకులు బతికేటోళ్లు. తల్లులకు కడుపుకోత ఉండేది కాదు.
– ఆగమ్మ, అమరువీరుడు శ్రీకాంత్ తల్లి, మేడ్చల్
తెలంగాణ ఇయ్వడంలో ఆలస్యం చేయడంతో పాటు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. సీఎం కేసీఆర్ నిరాహార దీక్షతో తెలంగాణ ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత ఏమైందో మాకు తెల్వదు. కానీ.. ఇయ్యలేదు. 15, 18, 20 ఏండ్ల పిల్లలు కూడా ఉద్యమం అని తిరిగేటోళ్లు. రోడ్లు మీద కూర్చోవడం, రోడ్ల మీదనే వంటలు చేసుకోవడం, ఎక్కడికక్కడ లారీ, బస్సులను ఆపడం చేస్తుండేటోళ్లు. ఎన్ని చేసినా కాంగ్రెసోళ్లు తెలంగాణ ఇయ్యకపోవడంతో కోపంతో మావోడు ప్రాణాలను తీసుకున్నడు. నా కొడుకు సురేష్ కూడా గోడపై తెలంగాణ కోసం చనిపోతున్నట్టు రాసి, ఉరేసుకున్నడు. ఆ పాపం అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానిదే. తెలంగాణను దోచుకున్న నాయకులే యువకులు ప్రాణాలను తీశారు. చెప్పినట్టు తెలంగాణ ఇచ్చి ఉంటే ఇంత పని అయ్యేది కాదు.
– యాదయ్య, అమరవీరుడు సురేశ్ తండ్రి, కిష్టాపూర్, మేడ్చల్