సిటీబ్యూరో, జనవరి 28 (నమస్తే తెలంగాణ): ఒక అధికారి గుత్తాధిపత్యంగా బల్దియాలోని ఇంజనీరింగ్ విభాగంపై పెత్తనం చెలాయిస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వ యంత్రాంగంలో అడిగే వాడు లేడు. ఉద్యోగితాస్వామ్యం (హైరార్కీ), ఆపై విధానం తెలిస్తేనే కదా.. ఎవరైనా ప్రశ్నించేది. అలాంటి వ్యవహారం కొనసాగుతున్నా జీహెచ్ఎంసీ పాలనా ‘బెల్లం కొట్టిన రాయిలా’ కొనసాగుతుంది. జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగ ముఖ్య అధికారి వ్యవహార శైలి రోజురోజుకు వివాదాస్పదమవుతున్నది. కీలక పోస్టులన్నీ తన గుప్పిట్లోకి తీసుకుని ఇష్టారీతిన వ్యవహరిస్తుండటం, ఎస్ఈ (సూపరింటెండెంట్ ఇంజనీరు) పోస్టుల భర్తీలో కాలయాపన చేస్తూ పైరవీలకు తెర లేపారన్న చర్చ ఇంజనీర్లలో మొదలైంది.
ఈఎన్సీతో పాటు కీలకమైన రెండు సీఈ పోస్టులు, ఎస్ఈ పోస్టును తన వద్దే ఉంచుకున్న సదరు ఉన్నతాధికారి ఇతర అధికారులకు మాత్రం సరైన పోస్టింగులు లేకుండా చేయడం ఏమిటి? అని ఇంజనీరింగ్ విభాగంలో ఏ ఇద్దరు కలిసినా ఇదే అంశాన్ని చర్చించుకుంటున్నారు. తెలంగాణకు చెందిన వ్యక్తి కాదని, ఐనా ఇక్కడి క్యాడర్లో తనకన్నా సీనియర్ అధికారులను కాదని కీలక స్థానాల్లో ఉండి తమపై పెత్తనం ఏమిటి? అని తెలంగాణ ప్రాంత ఇంజనీర్లు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంజనీరు పెద్ద ఎత్తున నిరసన సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. కమిషనర్‌ను కలిసి ఇంజనీరింగ్ విభాగంలో జరుగుతున్న తంతును వివరించనున్నట్లు ఓ ఇంజనీరు తెలిపారు.
చర్చనీయాంశంగా విభాగం..
జీహెచ్ఎంసీలో ఉన్న రెండు చీఫ్ ఇంజనీర్లు ఒక సూపరిటెండెంట్ ఇంజనీరు పోస్టును తన వద్ద ఉంచుకున్నారు. చీఫ్ ఇంజనీర్ పోస్టులలో ఒకటి మెయింటనెన్స్ విభాగం, మరొకటి ప్రాజెక్టుల విభాగం. నాలాల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఎన్డీపీ)లో కూడా ఒక సూపరిటెండెంట్ ఇంజనీరింగ్ పోస్టును తన వద్ద పెట్టుకోవడం ఇప్పుడు పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పై పోస్టుకు వెళ్లిన ఏ అధికారి అయిన తనకు అప్పటి వరకు ఉన్న పోస్టును ఇతరులకు అప్పగించాలి. తద్వారా కొత్త వారికి అవకాశం లభిస్తుంది. ఏ ఉద్యోగి అయినా.., నిత్యం తన పోస్టు మరింత ఉన్నతమైన పోస్టుగా ఉండాలని కోరుకుంటారు. సరిగ్గా అదే కోరుకున్న సదరు అధికారి డిపార్ట్మెంట్ హెడ్‌గా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటం గమనార్హం. ఇటీవల ఈఈలుగా పదోన్నతి పొంది జీహెచ్ఎంసీలో రిపోర్టు చేసిన వారికి సైతం పోస్టింగులు ఇవ్వలేదని ఇంజనీర్లు మండిపడుతున్నారు.
పోస్టింగులకు కాలయాపన
జీహెచ్ఎంసీలో ఖాళీగా ఉన్న ఐదు సూపరిటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ) పోస్టులకు నలుగురు సీనియర్ ఈఈలకు అడిషనల్ ఛార్జి ఇస్తూ అప్పటి ఈఎన్సీ దేవానంద్ గత డిసెంబర్ రెండో వారంలోనే ప్రతిపాదనలు పంపగా, కమిషనర్ అప్రూవల్ చేయలేదు. తర్వాత ఫైల్ పరిశీలించిన కమిషనర్ మరోసారి పరిశీలించి ఫైల్ పంపించాల్సిందిగా ప్రస్తుత సీఈ భాస్కర్ రెడ్డికి పంపించారు. నెల రోజులు గడుస్తున్నా తమ కింది ఉద్యోగుల పోస్టింగులకు సంబంధించిన ఫైల్‌ను పంపడంలో కాలయాపన చేస్తున్నారని ఇంజనీర్లు వాపోతున్నారు. సదరు అధికారి వ్యవహార శైలిపై ఉద్యోగుల్లో అసహనాన్ని పెంపొందిస్తున్నాయి.