బంజారాహిల్స్,జూలై 4: డబ్బుల కోసం గంజాయి విక్రయాలు చేస్తున్న వ్యక్తిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే..బీహార్‌లోని దర్భంగా జిల్లాకు చెందిన సికిందర్ కుమార్ మండల్(32) అనే వ్యక్తి ఆరేళ్ల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చాడు. మాదాపూర్‌లోని బావార్చి సమీపంలో టిఫిన్ సెంటర్లో మాస్టర్‌గా పనిచేస్తున్న సికిందర్కుమార్కు చాలా ఏళ్లుగా గంజాయి అలవాటు ఉంది. కాగా డబ్బులు సంపాదించేందుకు సొంతూరుకు వెళ్లినప్పుడల్లా గంజాయి కొని నగరానికి తెచ్చి అమ్ముతుంటాడు.
ఈ క్రమంలో ఇటీవల మద్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి వద్దనుంచి కొంత గంజాయి కొనుగోలు చేసిన సికిందర్‌కుమార్ జూబ్లీహిల్స్ రోడ్ నెం 60లోని రత్నదీప్ సూపర్‌మార్కెట్ సమీపంలో అమ్మేందుకు వచ్చాడు. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడకు చేరుకుని అనుమానాస్పదంగా కనిపించిన సికిందర్కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్దనుంచి 200గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఎన్డీపీఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు.