జవహర్‌నగర్, అక్టోబర్ 31: బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి ప్రతిపక్షాలకు ఏం చేయాలో తోస్తలేదని, సీట్లు అమ్ముకునే పార్టీల నాయకులు ప్రజలకు ఎలా సేవ చేస్తారా అని, సీఎం కేసీఆర్ సారధ్యంలోనే తెలంగాణ సుభిక్షంగా మారిందని కార్మికశాఖ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంగళవారం జవహర్‌నగర్ కార్పొరేషన్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని మంత్రి మల్లారెడ్డి, మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్‌లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో బీఆర్ఎస్కు తిరుగులేదని, కాంగ్రెస్, బీజేపీలు కొట్లాటలకే సరిపోతారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలో గెలువలేక దాడులకు దిగుతుందని, ఎంపీ కొత్త ప్రభాకర్‌పై దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. జవహర్‌నగర్‌లో బీఆర్ఎస్ బలంగా ఉందని, అత్యధిక మెజార్టీ జవహర్‌నగర్ నుంచే వస్తుందని ఆశాభావం వ్యక్త చేశారు. పేదలు నివసించే జవహర్‌నగర్‌ను జూబ్లీహిల్స్ తరహాలో తీర్చిదిద్దామని, రూ. 200కోట్లతో కార్పొరేషన్‌ను అభివృద్ధి చేసి తెలంగాణలోనే ఆదర్శవంతంగా అభివృద్ధి చేశామన్నారు. అనంతరం కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, జిల్లా నాయకులు మేకల అయ్యప్ప, రాజశేఖర్, యువజన విభాగం అధ్యక్షుడు భార్గవ్‌రామ్, ఉద్యమకారులు జిట్టా శ్రీనివాస్‌రెడ్డి, సుధాకర్‌చారి, సింగన్న బాల్‌రాజ్, మహేశ్, నవీన్, సిద్ధులు యాదవ్, సోమయ్య, మహిళా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.