నేరేడ్మెట్, జనవరి 27 : మల్కాజిగిరి వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో రూ. 80.47కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఆర్యూబీ-ఎల్హెచ్ఎస్ పనులకు మంగళవారం ఎంపీ ఈటల రాజేందర్‌తో కలిసి ఎమ్మెల్యే మర్రి రాజేందర్‌రెడ్డి నేరేడ్మెట్ రైల్వే స్టేషన్ వద్ద శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ.74.47 కోట్లతో ఆర్యూబీ పనులకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. ఇది మల్కాజిగిరి ప్రజల పోరాటానికి దక్కిన విజయంగా పేర్కొన్నారు. సఫిల్‌గూడ ప్రాంత ప్రజలకు ట్రాఫిక్ నరకయాతన నుంచి శాశ్వత విముక్తి కలిగించేందుకు రూ.12.81కోట్లతో ఎల్హెచ్ఎస్ పనులు ప్రారంభించినట్లు వెల్లడించారు.
ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డితో సమన్వయంతో చేసుకుంటూ మల్కాజిగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యతను తాను తీసుకుంటానని తెలిపారు. రైల్వే శాఖతో సమన్వయంతో ఈ పనులు వేగంగా పూర్తయ్యేలా తన వంతు సహకారం ఎప్పడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ డా.ఆర్. గోపాల్‌కృష్ణ, అడిషినల్ డీఆర్ఎం కే. ముత్యాల నాయుడు, ఎస్సీఆర్ సీపీఆర్ఓ శ్రీధర్‌రావు, డీజీఎం ఉదయ్‌నాథ్, కార్పొరేటర్లు మీనా, రాజ్యలక్ష్మి, సునీత యాదవ్, శ్రవణ్ కుమార్, మేకల సునీతా రాముయాదవ్, శాంతి శ్రీనివాస్‌రెడ్డి, సబిత కిశోర్ పాల్గొన్నారు.