సిటీబ్యూరో : గ్రేటర్లో వీధి లైట్ల నిర్వహణ జీహెచ్ఎంసీకి సవాల్‌గా మారింది. ఉన్నతాధికారుల బాధ్యతరాహిత్యం, ఏజెన్సీ నిర్లక్ష్యం వెరసి గ్రేటర్‌లోని పలు ప్రాంతాలు, రహదారుల్లో చీకట్లు అలుముకుంటున్నాయి. 5.48 లక్షల వీధి దీపాల్లో దాదాపు 20 శాతానికి పైగా వెలగడం లేదు. ఈ నేపథ్యంలోనే వీధి లైట్ల నిర్వహణ సక్రమంగా లేదని, మరమ్మతులు జరపాలంటూ రోజుకు వందల సంఖ్యలో ఫిర్యాదులొస్తున్నాయి. ఇటీవల కౌన్సిల్ సందర్భంగా వివిధ పార్టీల కార్పొరేటర్లు సైతం వీధి దీపాల లోపాలను తూర్పారపట్టారు. కమిషనర్ సైతం సమస్య ఏజెన్సీతో వచ్చిందని, దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించామని, జోన్ల వారీగా కొత్త వీధి లైట్లను అమర్చుతున్నట్లు ప్రకటించారు. అయితే కౌన్సిల్ జరిగి ఐదు రోజులు గడిచినా.. క్షేత్రస్థాయిలో వీధి దీపాల నిర్వహణ, కొత్త వీధి లైట్ల బిగింపు ప్రక్రియలో ఎలాంటి పురోగతి లేదు. ఏజెన్సీ మాత్రం తమకు బల్దియా నుంచి రూ. 100 కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉందని, వాటిని చెల్లిస్తేనే మరమ్మతు పనులు చేపట్టాల్సి ఉందని చెబుతూ వస్తుండడంతో సమస్య జఠిలంగా మారింది.
సుమారు 5.48 లక్షలకు పైగా..
గ్రేటర్లో సుమారు 5.48 లక్షలకు పైగా వీధి దీపాలను నిర్వహించే బాధ్యతలను 2018 ఏప్రిల్ నుంచి ఏడేండ్ల పాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్)కు అప్పగించిన సంగతి తెలిసిందే. వీటిలో 10 శాతం స్ట్రీట్ లైట్లు టైమర్ల సహాయంతో ఆటోమెటిక్‌గా వెలగడం, ఆటోమెటిక్‌గా ఆఫ్ అవుతుండగా, మిగిలిన వాటన్నింటినీ మ్యానువల్‌గానే నిర్వహిస్తున్నారు. అయితే నిర్వహణలో ఈఈఎస్ఎల్పై తరచూ కార్పొరేటర్లు ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు. ఒకానొక దశలో గత కమిషనర్లు సైతం మందలించారు.
ముఖ్యంగా వీధి దీపాల మరమ్మతుల పాలైనప్పుడు మార్చాల్సిన లైటు, ఇతర పరికరాలను ఎప్పటికీ సుమారు 15 శాతం రిజర్వ్ పెట్టుకోవాలన్న నిబంధన ఒప్పందంలో ఉన్నప్పటికీ దానిని ఈఈఎస్ఎల్ ఏ మాత్రం అమలు చేయడం లేదు. ఇటీవల కాలంలో తరచూ స్ట్రీట్ లైట్లు వెలగక ఇబ్బందులు పడుతున్నామంటూ టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. వాస్తవంగా గ్రేటర్లో వీధి లైట్లు రోజూ 98శాతం వెలగాల్సి ఉంది. కానీ ప్రస్తుతం 80 శాతం లోపే వెలుగుతున్నట్లు ఫిర్యాదుల ఆధారంగా కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. అందుబాటులో నిత్యం 27,500 (5శాతం) ఉండాలి. కానీ కేవలం మూడు వేలు మాత్రమే ఉండడం గమనార్హం. కొత్త వీధి లైట్ల బిగింపులో భాగంగా సీసీఎంఎస్ టెక్నాలజీతో 15,500 కొత్త ఎల్ఈడీలను అమర్చుతున్నట్లు అధికారులు చెప్పారు. ఎల్బీనగర్ జోన్లో 722, చార్మినార్‌లో 759, ఖైరతాబాద్‌లో 1031, శేరిలింగంపల్లిలో 454, కూకట్‌పల్లిలో 1585, సికింద్రాబాద్‌లో 606లు కలిపి మొత్తం 5157 చోట్ల వీధి లైట్లను అమర్చినట్లు అధికారులు పేర్కొన్నారు.