హైదరాబాద్, అక్టోబర్ 28(నమస్తే తెలంగాణ): ‘మీ అన్నలా నేను మీకు అండగా ఉంటా. మీ సమస్యలు పరిష్కరిస్తా. గోపన్న ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతా’నంటూ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు దివంగత నేత మాగంటి గోపీనాథ్ సతీమణి, జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ హామీ ఇచ్చారు. గోపన్నలా ప్రజల కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ప్రజలు ప్రేమతో గోపన్నగా పిలుచుకొనే ఆయన మరణం తమ కుటుంబంతో పాటు జూబ్లీహిల్స్ ప్రజలకు తీరని దుఃఖాన్ని మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆమె.. గోపీనాథ్ ఏ ఆశయాల కోసమైతే పని చేశారో.. వాటిని నెరవేర్చుతానని అందుకే రాజకీయాల్లోకి వచ్చానని గోపీనాథ్ చూపిన బాటలో నడుస్తున్నానని చెప్పారు. ఆయనకు జూబ్లీహిల్స్ ప్రజలే కుటుంబమని, ఆయన కుటుంబమే తమ కుటుంబమని చెప్పుకొచ్చారు. ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా విశేష స్పందన వస్తున్నదని.. కేసీఆర్ పథకాలు, చేసిన అభివృద్ధి, గోపీనాథ్ చేసిన పనులు, ప్రజలపై చూపిన ప్రేమే తన బలమని, అవే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తంచేశారు. అయితే ఎన్నికల్లో తనకు పడేవి సానుభూతి ఓట్లు కాదని, జూబ్లీహిల్స్ ప్రజలు అమాయకులేం కాదని, ఎవరి చిత్తశుద్ధి ఏమిటో గమనించే ఓటు వేస్తారని తెలిపారు.
సునీతాగోపీనాథ్: ఎన్టీఆర్ కాలం నాటి నుంచి ఆయనను గోపన్న అనేవారు. ఈయనకు ప్రజలతో, కార్యకర్తలు మమేకం కావడం ఇష్టం. వారేకేమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడం ఆయనకు చాలా ఇష్టం. ఎవరికైనా సాయం చేస్తే… ఈ రోజు ఒక మంచి పని చేశాను అని అనుకునేవారు. విడిగా ఉంటే ఎక్కువ మందికి సేవ చేయలేను. పదవిలో ఉంటే ఎక్కువ మంది సేవ చేసే అవకాశం ఉంటుందని నాతో చెప్పేవారు. ఆ తర్వాత ఎమ్మెల్యే అయ్యారు. కార్యకర్తలు, ప్రజలకు ఏ సమస్య వచ్చినా తీర్చేవారు. అన్న అంటే చాలు.. అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడాలేకుండా వెళ్లిపోయేవారు. ఆ సమస్య తీరే వరకు అక్కడే నిలబడేవారు. ముఖ్యంగా మహిళలు, ఆడపిల్లల సమస్యలపై మరింత కఠినంగా ఉండేవారు. సమస్య ఏదైనా కానీ, ఎదుట ఎవరైనా ఉండని ముందు వాళ్ల సమస్యను పరిష్కరించేవారు. ఇలా ప్రతి ఇంటికీ అండగా ఉండేవారు. ఇప్పుడు మేం బయటకు వెళితే తెలుస్తున్నది.. గోపన్నగా ప్రజలు ఆయన్ను ఎంతగా ఇష్టపడుతున్నారో. ఒక ఇంటి పెద్ద కొడుకుగా అండగా ఉండేవారు. తన కుటుంబం కన్నా ఎక్కువగా జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్నే తన కుటుంబంగా భావించేవారు. ఉదయం వెళితే.. ఎప్పుడో రాత్రి వచ్చేవారు. ప్రజలకు సంబంధించిన పని పూర్తయిన తర్వాతే ఇంటికి రావాలి.. ఆ తర్వాతే అన్నం తినాలి. అలా ఉండేవారు.
సునీతా గోపీనాథ్: పిల్లలతో, తనతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నానని అప్పుడప్పుడు బాధపడేవారు. పిల్లలు ఏమైనా ఫీలవుతారేమోనని అనుకునేవారు. పిల్లలు, కుటుంబ బాధ్యతతో నేను ఇబ్బంది పడుతున్నారని అనుకునేవారు. కానీ నేను ఎప్పుడూ చెప్పేదానిని.. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు.. పిల్లల బాధ్యత నేను చూసుకుంటాను.. మీరు మీ పనిపై దృష్టిపెట్టండి అని చెప్పేదానిని. రాజకీయంగా ఆయన్ను అర్థం చేసుకొని మేం కూడా ఎప్పుడు ఆయన్ను ఇబ్బంది పెట్టేవాళ్లం కాదు. కానీ భోజనం విషయంలో మాత్రం కచ్చితంగా ఉండేదానిని. సమయానికి తింటున్నారా లేదా అని. లేదంటే ఆరోగ్యసమస్యలు వస్తాయని చెప్పేవాళ్లం. మా పెళ్లయినప్పటి నుంచి ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఇప్పుడే మొదటిసారి ఆయన్ను ఆలా చూడడం. పండుగ సమయంలోనూ ప్రజలతోనే ఎక్కువగా గడిపేవారు. మేం ఎప్పుడు ఆయన దూరంగా ఉన్నారని అనుకునేవాళ్లం కాదు. ఆయన ప్రజలతో ఉన్నారు.. ప్రజలు కూడా మన కుటుంబ సభ్యులేననే ఫీలింగ్‌లో మేం ఉండేవాళ్లం.
సునీతాగోపీనాథ్: ఇలా అవుతుంది మేము అనుకోలేదు. ఇప్పటికీ ఊహించుకోవడం లేదు. బయటకు వెళ్లారు.. వస్తారు.. భోజనం పెట్టాలి అన్నట్టుగానే ఉన్నాం. తన అనారోగ్య సమస్యలు ఏమీ బయటకు చెప్పడం ఆయనకు ఇష్టం ఉండదు. తన కుటుంబ, ఆరోగ్య పరిస్థితి పార్టీకి, కార్యకర్తలకు తెలిస్తే కంగారు పడతారని భావించారు. దానిని పెద్దది చేసుకోవడం ఎందుకు మనమే పరిష్కరించుకుందాం అనుకున్నారు.
ఆసుపత్రిలో ఉన్నప్పుడు రాత్రి నిద్రలేచి బాధపడేవారు. పిల్లలకు, నాకు ఏం చేయలేకపోయానని, చాలా తప్పు చేశానని మదనపడేవారు. అప్పుడు నేనే ధైర్యం చెప్పాను. మాకు డబ్బులు అవసరం లేదు. మీరు ఆరోగ్యంగా తిరిగి వస్తే అదే చాలు. వీటి గురించి ఆలోచించకండి.. ఆరోగ్యం చూసుకోండని చెప్పేదాన్ని. (కంటతడి పెడుతూ…) ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు ఇదే అంశంపై ఎక్కువగా బాధపడేవారు. డాక్టర్ కూడా ఆయనకు చెప్పేవారు.. ‘ఎందుకయ్యా అంతగా ఆలోచిస్తున్నావు. పిల్లలు, భార్య మీకు అండగా ఉన్నారు. సంతోషంగా ఉండి. ఆరోగ్యంగా వెళ్లేలా చూసుకో అని చెప్పేవారు.’
అవును. ఆయనకు ఆర్థికపరంగా చాలా సమస్యలున్నాయి. సింహంలా బతికిన వ్యక్తి.. అందుకే అవేవీ బయటకు తెలియనిచ్చేవారు కాదు. ఒక విధంగా చెప్పాలంటే మా వద్ద డబ్బు లేదనే అభిప్రాయాన్ని మాకు కలిగించలేదు. ఇప్పుడు నేను కూడా ఆయన బాటలోనే వెళ్తాను. మాకు డబ్బు కావాలనే ఆశలేదు. ఒకవేళ డబ్బే ప్రధానం అని అనుకుంటే ఇప్పుడు మేం ఇలా ఉండేవాళ్లం కాదు. మన కష్టాలు బయటకు చెప్పొద్దని చెప్పేవారు. కనీసం మా అమ్మవాళ్ల కుటుంబంతో కూడా చెప్పొద్దని చెప్పేవారు. ఒకరి ముందు మనం అలుసు కావొద్దనేవారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బతుకమ్మ వంటి పండుగలకు మహిళలకు ముందు నుంచే చీరలు పంపిణీ చేసేవాళ్లం. ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం కూడా అమలు చేయడంతో ఆ తర్వాత బహుమతులు ఇవ్వడం ప్రారంభించాం. అన్ని పండుగలకు ఆయన ప్రజలకు ఏదో ఒక బహుమతి ఇచ్చేవారు. పార్టీతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా చేసేవారు. అలా చేయడం ఆయనకు సంతోషాన్నిచ్చేది. ప్రజలు బాగుండాలి, వాళ్లకు అవసరం ఉంటుంది.. ఏదో ఒకటి ఇవ్వాలనే విధంగా ఆలోచించేవారు. ఇప్పుడు ఏ ఇంటికి వెళ్లినా ఆయన ఇచ్చిన బహుమతులను మహిళలు చూపిస్తున్నారు. ‘అన్న మాకు అన్నీ ఇచ్చేవారు. ఇదిగో ఈ కిచెన్‌లో ఉన్న వస్తువులన్నీ అన్న ఇచ్చినవే’నని చూపిస్తున్నారు. ‘అన్న ఉంటే బాగుండేది. ఈ బతుకమ్మకు కూడా ఏదో ఒకటి ఇచ్చేవారు.’ అని బాధపడుతున్నారు.
కరోనా సమయంలో ఆహారం లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆయన చాలా బాధపడేవారు. అలాంటి వాళ్లందరికీ భోజనం పెట్టాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఇంట్లో పొయ్యి రోజంతా వెలుగుతూనే ఉండేది. ప్రొటీన్ ఫుడ్ పెట్టాలని గుడ్డు, చికెన్, సాంబార్, కర్రీ ఇలా పంచేవారు. సరిపోకపోతే ఇంకా చేయించేవారు. రంజాన్ వచ్చినప్పుడు హలీమ్ చేయించి ఇళ్లకు పంపించేవారు. మాకు కూడా కరోనా సోకుతుందేమోనని కొన్నిసార్లు మేం భయపడేవాళ్లం. కానీ మనకేం అయితదని ఆయన ధైర్యం చెప్పేవారు. భయం వద్దని జనంలోనే తిరిగేవారు.
ఆయన ఉన్నప్పుడు చాలా రకాలుగా చూసేవాళ్లం. జనాలు ఇంటికి వచ్చినప్పుడు, ఆయన జనాల వద్దకు వెళ్లినప్పుడు చాలా అంశాలను పరిశీలించేవాళ్లం. అలా చాలా అంశాలను తెలుసుకున్నాం. అలా అన్ని తెలుసు కాబట్టే బయటకు రాగలిగాను. ఆయన్ను చూసి నేర్చుకున్నవన్ని ఇప్పుడు అవసరం పడుతున్నాయి. గోపీనాథ్ ఏ ఆశయాల కోసమైతే పనిచేశారో, ఆయన ఏం చేయాలనుకున్నారో ఆ ఆశయాల కోసం నేను పని చేస్తాను.
ప్రజలే నా బలం. గోపన్న ప్రజలంతా నా ప్రజలే. ఆయనకు అండగా ఉన్న ప్రజలే ఇప్పుడు నాకు కూడా అండగా ఉన్నారు. అందుకే నేను ధైర్యంగా బయటకు రాగలిగాను. ఎక్కడికెళ్లినా వారే నాకు చెబుతున్నారు.. ‘గోపన్న ఇది చేశారు.. అది చేశారని. అసలు మీరెందుకు వస్తున్నారు.. రావాల్సిన అవసరం లేదమ్మా.. మా గోపన్నకు మేమే ఓటు వేసుకుంటాం’ అని చెబుతున్నారు. మా పెద్దపాప ప్రతీ ఇంటికి వెళ్లినప్పుడు ‘మా గోపన్ననే మా ఇంటికి వచ్చారు.’ అని సంతోషపడుతున్నారు.
అవును నిజమే పిల్లలు పెద్దయ్యారు. పెద్దపాపకు త్వరలోనే పెళ్లి చేయాలని ఆయన అనుకున్నారు. కానీ అనుకోని ఘటన జరిగింది. దీన్ని నుంచి మేం ఎప్పటికీ తేరుకోలేం. కానీ ఆయనిచ్చిన ధైర్యంతోనే ముందుకు వెళ్తున్నా.
నేను రాజకీయాల్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. గోపీనాథ్‌కు ఇలా అవుతుందని, నేను బయటకు రావాల్సి వస్తుందని ఎప్పుడూ ఊహించుకోలేదు. గోపీనాథ్ అనుకున్న కొన్ని ఆశయాలు మధ్యలో ఆగిపోయాయి. వాటిని నెరవేర్చడానికే నేను వచ్చాను.
అప్పుడప్పుడు చెప్పేవారు. ఎన్టీఆర్‌కు తానంటే చాలా ఇష్టమని, గోపీ గోపీ అంటూ పిలిచేవారని, అన్ని పనులు తనతోనే చేయించుకొనేవారని చెప్పేవారు. అయితే గోపీనాథ్ కృష్ణ ఫ్యాన్. కానీ ఎన్టీఆర్ అంటే అభిమానం. ఆ అభిమానంతోనే ఎన్టీఆర్ వద్ద పనిచేసేవారు. ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్లినా అక్కడ గోపీనాథ్ బుల్లెట్ ర్యాలీ తీసేవారు. చెన్నైకి వెళ్లినప్పుడు ఎన్టీఆర్ కన్నా ముందే బుల్లెట్లను విమానంలో పంపించి అక్కడ సిద్ధంగా ఉన్నారు. ఆ తర్వాత ఈ ర్యాలీని చూసి కరుణానిది గోపీనాథ్ గురించి వాకబు చేశారు. ఒక సమయంలో గోపీకి కరుణానిధి ఫోన్ చేసి.. ‘ఇదంతా చేసింది నువ్వేనని తెలుసుకున్నాను. నా దగ్గరికి వస్తావా. నీకు ఎంత కావాలంటే అంత డబ్బు ఇస్తానని’ చెప్పారు. కానీ గోపీనాథ్ మాత్రం తాను డబ్బు కోసం చేయడం లేదని, ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానంతో చేస్తున్నానని చెప్పారు.
బీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత మాకు ఎప్పుడూ ఒక మాట చెబుతుండేవారు. ‘ఎన్టీఆర్ తర్వాత కేసీఆర్‌ను మించిన నాయకుడు లేడు.. రాడు.’ అని చెప్పేవాళ్లు. చివరి వరకు తాను కేసీఆర్ వెంటే ఉంటానని చెప్పేవారు. కేసీఆర్ తనను ఒక కొడుకులా చూసేకునేవారని, ఆయన్ను చూస్తే నాకు ఒక తండ్రిలా సంతోషంగా ఉండేదని చెప్పేవారు. గోపీనాథ్ చనిపోయినప్పుడు కేసీఆర్ చాలా ఏడ్చారు. అది చూసి నిజమే అనిపించింది. వారి మధ్య అనుబంధం ఎంత గొప్పదో అర్థమైంది. పార్టీ మాకు అన్ని విధాలా అండగా ఉంది. మాకు అండగా ఉన్న పార్టీతో చివరి వరకు అండగా ఉంటాను.
కేసీఆర్ అమలు చేసిన పథకాలు, అభివృద్ధి, గోపీనాథ్ చేయించిన పనులే నాకు అండగా ఉంటాయి. ఏ పథకం వచ్చినా ప్రజలకు అందుతుందో లేదోననే సందేహాంతో ఆయనే స్వయంగా ప్రతి గడపగడపకూ వెళ్లి ఆయన చేతులతోనే పంపిణీ చేసేవారు. ఇలా గోపన్న చేసిన సేవ, చేసిన పనులే నన్ను గెలిపిస్తాయి.
నేను ప్రచారానికి వెళ్లినప్పుడు ఈ రోడ్డు వేసింది గోపన్నే, ఈ నీళ్లు ఇచ్చింది గోపన్నే అని వాళ్లే చెబుతున్నారు. ఎవరూ చేయలేనిది ఆయన చేశారు. మా పెద్ద కొడుకు పోయినట్లుగా ఉందంటున్నారు. అన్నా అంటే అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుంటే సమస్య తీర్చేవారు.. ఇప్పుడు ఎవరుంటారని బాధపడుతున్నారు. నేను కూడా వాళ్లకు చెబుతున్నాను.. ‘మీ అన్నలా నేను మీకు అండగా ఉంటా. మీ సమస్యలు పరిష్కరిస్తా’నని చెబుతున్నాను. గోపన్న ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతా. నాకు భయమనేది తెలియదు. ప్రతి ఇంటిలో ఆయన అన్నా అని పిలిపించుకునేవారు. వాళ్ల గోపన్న వాళ్లకు ఏ విధంగా అండగా ఉన్నారో అదే విధంగా నేను సునీతమ్మల అండగా ఉంటాను. కొందరు చెప్పే వాళ్లు.. అన్నతో కొన్నే చెప్పుకొనే వాళ్లం. మీరొచ్చారు.. ఇక మా సమస్యలన్నీ చెప్పుకొంటామని అంటున్నారు. నేను కూడా సునీతమ్మలా అండగా ఉంటానని మాటిస్తున్నాను.