సిటీబ్యూరో, అక్టోబరు 12 (నమస్తే తెలంగాణ ): జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్‌ను భారీ మెజార్టీతో గెలిపించడమే లక్ష్యంగా పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు, శ్రేణులు ప్రత్యేక వ్యూహాలతో ప్రచార పర్వాన్ని సాగిస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పటికే నియోజకవర్గంలో డివిజన్ల వారీగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించారు.
నేటి నుంచి బూత్ స్థాయి సమావేశాలకు శ్రీకారం చూడుతున్నారు. ఒకవైపు సమావేశాలు మరోవైపు చేరికలతో పార్టీలో జోష్ పెంచారు. ఈ నేపథ్యంలోనే డివిజన్ల వారీగా మాజీ మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాగంటి సునీత గోపీనాథ్‌కు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుండటం, ప్రజలు అడుగడుగునా నీరాజనం పడుతున్నారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ..ఓటు అభ్యర్థిస్తూ ముందుకు వెళ్తున్న అభ్యర్థులకు వాడవాడలా, కాలనీలు బ్రహ్మరథం పడుతున్నారు.
22 నెలలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి, కారు కావాలా? బుల్డోజర్ కావాలా? అంటూ ప్రచారాన్ని హీటెక్కించారు. ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల కంటే ముందున్న బీఆర్ఎస్ జాతీయ పార్టీల డిపాజిట్లను గల్లంతు చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పావులు కదుపుతున్నారు. కలిసి వచ్చే ఇతర పార్టీల నేతలకు గులాబీ కండువాలు కప్పుతూ నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతూ కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెమటలు పట్టిస్తున్నారు. అన్ని వర్గాల మద్దతును కూడగడుతూ ప్రత్యర్థులకు వెన్నులో వణుకుపుట్టిస్తున్నారు..