 
                                                            హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మాగంటి సునీతాగోపీనాథ్ గెలుపును ప్రజలు ఇప్పటికే ఖాయం చేశారని, భారీ మెజారిటీ సాధించడమే మన ముందు ఉన్న లక్ష్యమని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. పార్టీ నేతలు జూబ్లీహిల్స్ ప్రజల వద్దకు వెళ్లి వారితో మమేకమై కాంగ్రెస్ దుష్టపాలన పట్ల మరింత అవగాహన కల్పించి భారీ గెలుపు కోసం ప్రయత్నించాలని సూచించారు. ‘ఇందుకు డివిజన్లవారీగా, క్లస్టర్లవారీగా పార్టీ నేతలంతా వ్యూహంతో పనిచేయాలి. అన్ని డివిజన్లలో, క్లస్టర్లలో ప్రజలు బీఆర్ఎస్కు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని, చివరి నిమిషం వరకు ప్రతి ఓటు పోలయ్యేలా చూడాలి. జూబ్లీహిల్స్ ప్రచారంలో రౌడీషీటర్లే ప్రచారంలో పాల్గొంటున్నరు. ఈ విషయాన్ని ఇప్పడికే జూబ్లీహిల్స్ ప్రజలు గమనించారు.
రౌడీ షీటర్‌గా పేరున్న కాంగ్రెస్ అభ్యర్థి పొరపాటున గెలిస్తే గనక జూబ్లీహిల్స్‌లో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉంటుందో అకడి ప్రజలు ఆలోచన చేయాలి. కత్తులు కటార్లతో ఇప్పుడే వీరంగం వేస్తున్న అభ్యర్ధి తాలూకు మనుషులు రేపు గెలిస్తే ఎట్లా ఉంటదనే విషయం.. రౌడీలను గెలిపిస్తే జూబ్లీహిల్స్ ఇజ్జతే ఉంటదా? అనీ ప్రజలకు అర్థం చేయించాలి’ అని కేసీఆర్ సూచించారు. జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్ను భారీ మెజారిటీతో గెలిపించాలనే లక్ష్యంతో తన అధ్యక్షతన ఎర్రవెల్లి నివాసంలో గురువారం నిర్వహించిన సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సునీతాగోపీనాథ్ భారీ మెజారిటీతో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలు ఎత్తుగడలు, కార్యాచరణకు సంబంధించిన అంశాలపై పలు సూచనలు చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ 22 నెలల పాలనలో తెలంగాణ దిగజారిన అభివృద్ధి గురించి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో తలెత్తిన ప్రమాదకర పరిస్థితులను గురించి ఇంటింటికీ తిరిగి ప్రజలకు వివరించాలని పార్టీ నేతలకు అధినేత కేసీఆర్ సూచించారు. ‘హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూలగొడుతూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని మొత్తానికే కుప్ప కూల్చిండ్రు. ఆ రంగంలో పనిచేసే లక్షలాది మంది జీవితాలను ఆగం చేసిండ్రు. ఇదే విషయం మీద కోపంతో ఉన్న ప్రజలకు.. అండగా నిలుస్తామని మీరు భరోసాను కల్పించాలి’ అని కేసీఆర్ సూచించారు.
జూబ్లీహిల్స్ ప్రజలకు బీజేపీ గురించిన ఆలోచనేలేదని కేసీఆర్ స్పష్టం చేశారు. సమావేశంలో పార్టీ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్తోపాటు ఉపఎన్నిక కోఆర్డినేటర్లుగా ఉన్న వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్ అలీ, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, జీ జగదీశ్ రెడ్డి, లక్ష్మారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
 
                            