సిటీ బ్యూరో, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్కు కంచుకోటైన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గులాబీ శ్రేణులు ఉప ఎన్నిక ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఒకవైపు మాగంటి గోపీనాథ్ కుటుంబం, మరోవైపు పార్టీ నేతలు కార్యకర్తలు ప్రజలతో మమేకమై కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు కళ్లకు గట్టినట్లు వివరిస్తున్నారు. తాజాగా ఉపఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో గులాబీ శ్రేణుల్లో కొత్త జోష్ నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ కంచుకోటగా పేరుగాంచిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం ఊపందుకుంది. ప్రత్యర్థి పార్టీలు నిర్వహించిన సర్వేల్లోనూ ఓటర్లు బీఆర్ఎస్ పార్టీకే పట్టం కడుతున్నరు. గోపన్న చేసిన మంచి పనులను స్మరించుకుంటూ ఆయన సతీమణి వెంట వేలాదిగా కదులుతున్నారు. దశాబ్ద కాలంగా వరుస విజయాలతో గులాబీ పార్టీ తిరుగులేకుండా నియోజకవర్గంలో దూసుకుపోతున్నది.
ప్ర త్యర్థి పార్టీలకు అందనంత దూరంలో ముం దున్నది. ఎన్నికల బరిలో ప్రత్యర్థి పార్టీలు ఎన్ని కుయుక్తులు పన్నినా, అడ్డదారిలో కలిసి నడిచినా బీఆర్ఎస్ పార్టీ ముందు నిలువలేకపోతున్నాయి. దశాబ్దానికిపైగా గులాబీ జెండాను ఇక్కడి ఓటర్లు అక్కున చేర్చుకుం టూ వస్తున్నారు.. హ్యాట్రిక్ ఎమ్మెల్యేల జాబితాలో ఒకరుగా నిలిచిన మాగంటి గోపీనాథ్ పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో రూ.వేల కోట్లు ఖర్చు చేసి నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. గోపీనాథ్ సారథ్యంలో సంక్షేమం, అభివృద్ధి పథకాలతో ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ చెక్కు చెదరని స్థానాన్ని సంపాదించుకున్నది.
ఈ నేపథ్యంలోనే 20 18 అసెంబ్లీ ఎన్నికల్లో 44 శాతం ఓట్ల షేర్ సాధించగా..2023 అసెంబ్లీ ఎన్నికల్లో 43.94శాతంతో మాగంటి గోపీనాథ్‌కు జనా లు పట్టం కట్టారు. ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల్లోనే కాదు..గడిచిన రెండు పర్యాయాలుగా మెజార్టీ డివిజన్లలో గులాబీ జెండా పాగా వేసింది. జూబ్లీహిల్స్ నుంచి హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకున్న మాగంటి గోపీనాథ్ మరణానంతరం ఆయన సతీమణి సునీతకు టికెట్ ఇవ్వడంతో గెలుపు లాంఛనమేననే ప్రచారం జరుగుతున్నది. కేటీఆర్ సహా నేతలంతా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని నియోజకవర్గ ప్రజలు సాదరంగా ఇక ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్కే మళ్లీ ఓటర్లు పట్టం కడతారని రాజకీయ విశ్లేషకులు
చెబుతున్నారు.
జూబ్లీహిల్స్‌లో ఎన్నిక ఏదైనా బీఆర్ఎస్కు ఉన్న ఓటు బ్యాంకు ఏ మాత్రం చెక్కు చెదరడం లేదని గడిచిన పదేండ్ల కాలంలో వచ్చిన ఎన్నికలే రుజువు చేస్తున్నాయి. గులాబీ కండువాతో మాగంటి గోపీనాథ్ నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీల ఉనికి లేకుండా చేశారన్నది రాజకీయ నేతలే బహిరంగంగా చెబుతున్నారు. ఆయనపై ఎవరెన్ని కుట్రలు, తిరుగుబావుటా ఎగరవేసినా గులాబీ జెండాతో నియోజకవర్గ ప్రజలను అభివృద్ధి వైపు నడిపించారు. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంటింటికీ వెళ్లి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేశారు. పండుగ ఏదైనా బహుమతులను అందజేసి అందరివాడుగా మాగంటి నిలిచారు. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారథ్యంలోనే పార్టీ బూత్ స్థాయిలో పటిష్టంగా ఉంది. లోకల్ క్యాడర్ గట్టిగా ఉండడం, మాగంటి గోపీనాథ్ భౌతికంగా దూరమైనా ఆయన పార్టీపై నిబద్ధతను, బీఆర్ఎస్ పార్టీ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేలా గులాబీ శ్రేణులు కంకణబద్ధులై కదం తొక్కుతున్నారు.
ఎమ్మెల్యే ఎన్నిక నుంచి కార్పొరేషన్ ఎన్నికల దాకా బీఆర్ఎస్ పాగా వేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి గడిచిన రెండు పర్యాయాలు మెజార్టీ డివిజన్లను బీఆర్ఎస్ సొంతం చేసుకున్నది. ఏడు డివిజన్లలో ఒకటి రెండు మినహా అన్ని డివిజన్లలో గులాబీ పార్టీకి చెందిన కార్పొరేటర్లే ఉన్నారు. 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 స్థానాలు కైవసం చేసుకోగా..జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో యూసుఫ్‌గూడ, బోరబండ, రహ్మత్‌నగర్, వెంగళ్రావు నగర్, షేక్‌పేట, సోమాజిగూడ డివిజన్లను సొంతం చేసుకోగా, 2020 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో షేక్‌పేట, ఎర్రగడ్డ డివిజన్లు మినహా మిగిలిన డివిజన్లలో బీఆర్ఎస్ సత్తా చాటింది. బీఆర్ఎస్లో గెలిచిన ఒకరిద్దరు ఇతర పార్టీలో చేరిన డివిజన్లలో తిరుగులేని శక్తిగా బీఆర్ఎస్ అవతరించింది. బలమైన క్యాడర్‌తో ఉప ఎన్నికల్లోనూ తమ సత్తా చాటుతామని శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.