మాదాపూర్, నవంబర్ 23: కార్యకర్తల సమష్టి కృషితోనే పార్టీ బలోపేతం అవుతుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మాదాపూర్లోని ఇజ్జత్ నగర్ కాలనీలో ఆదివారం మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ గౌరవాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నం పెట్టిన బీఆర్ఎస్ను కాదని ఆస్తులు కాపాడుకోవడానికి, భూ కబ్జాలు చేయడానికి పార్టీ మారిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి రాజకీయంగా కొనసాగే హక్కు లేదని విమర్శించారు. స్పీకర్ వద్ద ఒకలా ప్రజల వద్ద మరోలా ఉండే ఎమ్మెల్యే గాంధీ ఏ పార్టీలో ఉంటున్నాడో ఆయనకే తెలియదని, అటువంటి ఎమ్మెల్యేకు భవిష్యత్లో మనుగడ ఉండదని హెచ్చరించారు.
నాయకుడు దారి తప్పినా కార్యకర్తలు సైనికుల్లా పార్టీకి అండగా ఉన్నారన్నారు. కూకట్పల్లిలో తొమ్మిది కార్పొరేటర్లలో ఏ ఒకరు కూడా పార్టీని వీడకుండా ప్రజలకు సేవలు చేస్తున్నారని, అటువంటిది శేరిలింగంపల్లిలో కార్పొరేటర్లు పార్టీని వీడవలసిన అవసరం ఎందుకు వచ్చిందో ప్రజలే గమనించాలన్నారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పోకడలతో అటు ప్రజలు, ఇటు కార్పొరేటర్లు కూడా అనేక ఇబ్బందులు పడటంతోనే పార్టీ మారే దుస్థితి వచ్చిందన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఎవరో బయట వ్యక్తి వచ్చి డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ తీసుకుంటాడని అనేక మంది పార్టీ కార్యకర్తల్లో సందేహలు ఉన్నాయని, స్థానికంగా ఉండే వ్యక్తికి టికెట్ ఇప్పించి గెలుపించే బాధ్యతను కూడా తీసుకుంటానని హమీ ఇచ్చారు.
రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో శేరిలింగంపల్లిలో పదికి పది డివిజన్లలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. డివిజన్లో ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకొని క్షేత్ర స్థాయిలో వాటిని పరిష్కరించేందుకు జనవరి చివరి వారం కల్లా కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే కృష్ణారావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివేకనంద నగర్ మాజీ కార్పొరేటర్ మధవరం రంగారావు, గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబ, బొబ్బ నవతరెడ్డి, మారబోయిన రవి యాదవ్, నాయకులు వాలా హరీష్ రావు, చిన్న మధుసుధన్రెడ్డి, భిక్షపతి ముదిరాజ్, శ్రీనివాస్ రావు, సంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.