బాలానగర్, ఆగస్టు 1: బాలానగర్లో పిచ్చి కుక్క స్వైరవిహారం చేసింది. ప్రజలను ఉరికిస్తూ… దొరికిన వారిని దొరికినట్లు కరుస్తూ.. బీభత్సాన్ని సృష్టించింది. ఏకంగా 16 మందిని కరిచింది. బాధితుల్లో రెండేండ్ల చిన్నారుల నుంచి పెద్దల వరకు ఉన్నారు. గురువారం సాయంత్రం రాజు కాలనీలో బయట ఆడుకుంటున్న చిన్నారులను పిచ్చి కుక్క కరవడం మొదలుపెట్టింది.
రవళి, చైతన్య, మధు, గణేశ్, సృజన్, ప్రవళిక, వాసీం, అమన్దీప్సింగ్, ప్రభాకర్, రజాక్.. ఇలా వీరందరిపై దాడి చేసింది. దీంతో స్థానికులు కర్రలు తీసుకొని వెంటపడటంతో వినాయకనగర్ కాలనీలోకి వెళ్లింది. అక్కడ కూడా పలువురిని వెంటబడి కరవడంతో అక్కడి ప్రజలు సైతం కర్రలతో తరిమారు.
అనంతరం కుక్క నవజీవన్నగర్ కాలనీలోకి చొరబడి అక్కడ కూడా మరికొందరిని కరిచింది. ఇలా మూడు చోట్ల ఏకంగా పదహారు మందిని కరవడంతో స్థానికులు పరుగులు తీశారు. మూడు కాలనీల్లో కేవలం గంట వ్యవధిలోనే పదుల సంఖ్యలో కుక్క బారిన పడటంతో స్థానికులు జీహెచ్ఎంసీకి సమాచారం అందించారు. సిబ్బంది ఎట్టకేలకు నవజీవన్నగర్ కాలనీలో ఆ పిచ్చి కుక్కను పట్టుకొని వాహనంలో అక్కడి నుంచి తరలించారు.
బాధితులకు పీహెచ్సీలో చికిత్స
మూడు కాలనీల్లో పిచ్చి కుక్క బారిన పడిన వారికి బాలానగర్ ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందించారు. గురువారం ఒక్కరోజే 22 మంది కుక్క కాటు బాధితులు పీహెచ్సీకి వచ్చి వ్యాక్సిన్ తీసుకున్నారని సిబ్బంది పేర్కొనడం గమనార్హం.
పిచ్చికుక్కలు తిరుగుతున్నా..
రాజుకాలనీలో పిచ్చికుక్కలు తిరుగుతున్నా.. జీహెచ్ఎంసీ సిబ్బంది పట్టించుకోవడం లేదు. ఫిర్యాదులు చేసినప్పుడు వస్తున్నారు. కుక్కలను తీసుకుపోయి ఇంజక్షన్లు చేసి తిరిగి ఇక్కడికే తీసుకొచ్చి వదిలి వేస్తున్నారు.
-బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్రెడ్డి