Hyderabad Metro Rail | సిటీబ్యూరో, ఏప్రిల్ 24(నమస్తే తెలంగాణ): ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ కసరత్తు మొదలుపెట్టింది. ప్రయాణికుల రద్దీ పెరిగిన నష్టాలు తగ్గకపోవడం, కమర్షియల్ స్పేస్ రెవెన్యూ లేకపోవడంతో చార్జీలు పెంచడమే అనివార్యం అన్నట్లుగా వ్యవహారించింది. కానీ రెవెన్యూ పెంచుకునే అంశాలపై దృష్టి పెట్టకపోవడంతో ఇప్పుడు ఆ భారాన్ని భర్తీ చేసుకునేందుకు చార్జీలు పెంచాల్సిందేనని ప్రభుత్వాన్ని కోరనున్నది.
ఎల్ అండ్ టీ సంస్థకు గతేడాది 9 నెలల వ్యవధిలో రూ. 393 కోట్ల నష్టం వచ్చినట్లు తెలిసింది. 2021 నుంచి 2024 వరకు రూ. 6వేల కోట్ల నష్టం వచ్చింద. అయితే గడిచిన నాలుగేండ్లుగా నష్టాల భారం క్రమంగా తగ్గుతున్నట్లు గణాంకాలు చెబుతుండగా… చార్జీల పెంపు కోసం ప్రభుత్వానికి రెండు ప్రతిపాదనలు చేయనున్నట్లు తెలిసింది. ఇందులో 20-30 శాతం చార్జీల పెంపు, లేదా వయబులిటీ గ్యాప్ ఫండ్ రూపంలో నిధులు సర్దుబాటు చేస్తే, ఇప్పటివరకు వచ్చిన నష్టాలను భర్తీ చేసుకోవచ్చనే ఎల్ అండ్ టీ మెట్రో భావిస్తోంది.