L&T Metro | సిటీబ్యూరో: రవాణా ఆధారిత అభివృద్ధి అన్న నినాదానికి ఎల్ అండ్ టీ మెట్రో స్వస్తి పలుకుతోంది. సమగ్ర రవాణా వ్యవస్థతో అత్యంత మెరుగైన అభివృద్ధి సాధించవచ్చన్న లక్ష్యంతో చేపట్టిన రవాణా ఆధారిత అభివృద్ధికి తూట్లు పొడుస్తూ ..ఎల్ అండ్ టీ మెట్రో సంస్థ క్రమంగా రియల్ ఎస్టేట్ కార్యకలాపాలను చేపట్టకుండా ఇతర సంస్థలకు అప్పగిస్తుండటంతో టీవోడీ లక్ష్యం దెబ్బతింటోంది. ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రవాణా ఆధారిత అభివృద్ధి కేంద్రాలైన మెట్రోమాల్స్ను దీర్ఘ కాలిక లీజుకు ఇచ్చేందుకు ఎల్ అండ్ టీ సంస్థ ప్రైవేటు సంస్థలతో సంప్రదింపులు చేస్తోంది.
ఇప్పటికే ప్రాజెక్టు భాగంగా ఎల్ అండ్ టీ మెట్రో సంస్థకు ప్రభుత్వం రాయదుర్గంలోని మైండ్ స్పేస్ జంక్షన్ సమీపంలో 15 ఎకరాలను కేటాయించింది. అందులో రవాణా ఆధారిత అభివృద్ధి (ట్రాన్సిట్ ఓరియెంట్ డెవలప్మెంట్-టీవోడీ)లో భాగంగా బిజినెస్ పార్కు టవర్ 1ను నిర్మించారు. మిగతా ఖాళీ స్థలాన్ని మొత్తంగా ఇతర సంస్థలకు గతేడాది దీర్ఘకాలిక లీజుకు ఇచ్చారు. దీని ద్వారా సుమారు రూ. 1200 కోట్ల ఒకేసారి సమకూర్చుకున్నట్లు సమాచారం. అదేవిధంగా కారిడార్-1లో పంజాగుట్ట, ఎర్రమంజిల్, మూసారంబాగ్ ప్రాంతాల్లో 3 మెట్రో మాల్స్‌ను నిర్మించగా, కారిడార్-3లో హైటెక్ సిటీ వద్ద మాల్‌ను నిర్మించారు. మొత్తం 4 మాల్స్ ఉండగా, వాటి విస్తీర్ణం 12 లక్షల చదరపు అడుగుల వరకు ఉంది. ఎల్ అండ్ టీ మెట్రో సంస్థ హైదరాబాద్ నెక్ట్స్ గలేరియా పేరుతో మాల్స్‌ను నిర్వహిస్తోంది.
వీటన్నింటినీ థర్డ్ పార్టీలకు అప్పగించాలని నిర్ణయం తీసుకొన్నది. ఇతరులకు భూములను అప్పగించడం ద్వారా అక్కడ ప్రజా ప్రయోజనాల కన్నా, తమ లాభాలను పరిగణలోకి తీసుకొని ప్రైవేటు సంస్థలు రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు నిర్వహించే అవకాశమున్నది. మెట్రో స్టేషన్లతో రైల్వే, ఎంఎంటీఎస్, బస్స్టేషన్ల వంటి ప్రధాన రవాణా మార్గాల్లో నివాస, వాణిజ్య, వినోద కార్యక్రమాల నిర్వహణ వంటి బహుళ ప్రయోజనాలకు ఉద్దేశించిన టీవోడీ ప్రాజెక్టులు ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన నేపథ్యంలో నగరంలోనూ ఈ తరహా ప్రాజెక్టు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఆ దిశగా ఎల్ అండ్ టీ మెట్రో రైలు సంస్థ మాత్రం అభివృద్ధి చేయడం లేదనే ఆరోపణలున్నాయి.
టీవోడీ అంటే ?
రవాణా వ్యవస్థ ఉన్న చోట అన్ని రకాల అభివృద్ధికి నిలయమైన నిర్మాణాలను చేపట్టడం, దూరం ఎంతైనా క్షణాల్లో చేరుకునే ప్రయాణ సదుపాయం కల్పించడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. ఇందులో భాగంగా రైల్వేస్టేషన్లకు అర కిలోమీటర్ నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రాంతంలో సకల వసతులతో టీవోడీ కింద ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యంలో నివాస, వినోద, వాణిజ్య నిర్మాణాలను చేపడుతారు. అపార్ట్మెంట్లు, మాల్స్‌తో పాటు ఐటీ అనుబంధ సంస్థలు ఇక్కడ ఏర్పాటవుతాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో రహదారులు, ఇతర రవాణా వసతులుంటాయి. సైక్లింగ్ జోన్లు ఉంటాయి. కాలుష్యరహితంగా వీటిని తీర్చిదిద్దుతారు. నిరంతర రాకపోకలు సాగించే వారికి ఈ ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయి. కాగా, అలాంటి నిర్మాణాలు, ఏర్పాట్లు మెట్రో రైలు ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు కావడం లేదు. ప్రజా రవాణా వ్యవస్థల మధ్య సరైన అనుసంధానం సరిగా లేదని నగర ప్రయాణికులు పేర్కొంటున్నారు.