సిటీబ్యూరో, మే 10 (నమస్తే తెలంగాణ): లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీంలో ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విధానం, రియల్ ఎస్టేట్ మార్కెట్ నేలచూపు.. ఖజానా ఆశలను గల్లంతు చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ పరిధిలో కలిపి దాదాపు రూ. 7వేల కోట్ల రెవెన్యూ ఆశించిన ప్రభుత్వానికి దరఖాస్తుదారుల నుంచి చుక్కెదురైంది. గత ప్రభుత్వానికి భిన్నంగా దరఖాస్తుల పరిశీలన చేయకుండానే ఫీజులు చెల్లించాలని చెప్పడం, అందులోనూ ఫీజులు చెల్లించిన ప్రొసీడింగుల జారీలో జాప్యం..వంటివి ఎల్ఆర్ఎస్కు ఆదరణ లేకుండాపోయిందన్న చర్చ అధికార వర్గాల్లో నెలకొంది.
దరఖాస్తులను పరిశీలించకుండానే..
జీపీ లే అవుట్లు, అనధికారిక వెంచర్లలో ఓపెన్ ప్లాట్లను క్రమబద్ధీకరిస్తామని, ఇందుకు ముందుగానే ఫీజులు చెల్లించాలని కాంగ్రెస్ సర్కారు ప్రకటించింది. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే గనుక, చెల్లించిన ఫీజులో 10 శాతం కోత విధించి మిగిలిన 90 శాతాన్ని దరఖాస్తుదారులకు తిరిగి చెల్లిస్తామని ప్రకటించింది. ఇదే ఎల్ఆర్ఎస్పై వచ్చే ఆదాయానికి గండికొట్టిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. మొత్తం దరఖాసుల్లో ఫీజు నోటీసులు చెల్లించాలని ఆదేశించినా… అర్జీలు పరిశీలించకుండానే ఫీజులు ఎలా చెల్లించేదని.. చాలా మంది వెనకడుగు వేశారు.
మూడు దశల్లో జరిగే క్రమబద్ధీకరణ ప్రక్రియలో తొలుత టైటిల్ వెరిఫికేషన్, రెండో దశలో ఇరిగేషన్, రెవెన్యూ విభాగాల పరిశీలన తర్వాత దరఖాస్తులకు మూడో దశలో ప్రొసీడింగులు జారీ చేస్తోంది. కానీ ప్రభుత్వం మాత్రం ఇవేవి చేయకుండానే ఫీజులు వసూలు చేసే ప్రయత్నం చేసింది. అదేవిధంగా ఒకవేళ ఫీజులు చెల్లించిన నిర్ణీత గడువులోగా ప్రొసీడింగ్‌లు జారీ చేస్తామని స్పష్టంగా చెప్పకపోవడమే ఎల్ఆర్ఎస్ స్పందన కరువయ్యేలా చేసింది.
రియల్ ఢమాల్ మరో కారణం..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ మార్కెట్లో ప్రతికూల పరిస్థితులు కూడా ఎల్ఆర్ఎస్ రెవెన్యూపై పెట్టుకున్న ఆశలకు చెక్ పెట్టాయి. ఏడాదిన్నర కాలంగా ప్రభుత్వం తీసుకున్న ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు మార్కెట్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాయనే రియల్ ఎస్టేట్ వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. హైడ్రా కూల్చివేతలు, మౌలిక వసతుల ప్రాజెక్టుల ప్రణాళికల్లో తెచ్చిన మార్పులు కూడా దరఖాస్తుదారులను ఎల్ఆర్ఎస్ ఆకట్టుకోలేకపోయింది.