సిటీబ్యూరో, ఫిబ్రవరి 22(నమస్తే తెలంగాణ): లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) హెచ్ఎండీఏ పరిధిలో అత్యంత క్లిష్టంగా మారింది. అరకొర సిబ్బంది, రెండు విభాగాల మధ్య సమన్వయంతో జరగాల్సిన వ్యవహారాలతో దరఖాస్తుల పరిశీలన అసాధ్యమనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. నిర్ణీత గడువులోగా పెండింగ్లో ఉన్న లక్షల దరఖాస్తులకు మోక్షం కలిగించడం అనుకున్నంత సులభమేమి కాదని తెలుస్తున్నది.
ఏడు జిల్లాల్లో విస్తరించిన హెచ్ఎండీఏ పరిధిలో మొత్తం 3.60 లక్షల మంది ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కొన్ని దరఖాస్తుల పరిశీలన పూర్తి అయినా.. ఇందు లో 30-40 శాతానికి పైగా దరఖాస్తుదారులకు ఫీజులు చెల్లించాలని సమాచారాన్ని అందించారు. అయితే మిగిలి ఉన్న లక్షల దరఖాస్తుల క్రమబద్ధీకరణకు వీలు ఉన్న దరఖాస్తులు ఎన్ని, ఇందులో సాంకేతిక సమస్యలు, ఇతర షార్ట్ఫాల్ వంటివి పరిశీలించాల్సి ఉండగా.. మూడు దఫాలుగా జరిగే ఈ ప్రక్రియ అనుకున్నంత వేగంగా, సులభంగా జరిగే అవకాశం కనిపించడం లే దు. దీంతో మార్చి 31లోపు ఆ దరఖాస్తులు క్లియర్ కాకపోతే… ప్రభుత్వం ఇచ్చే 25శాతం రాయితీ అవకాశాన్ని దరఖాస్తుదారులు కోల్పోనున్నారు.
హెచ్ఎండీఏ పరిధిలో సుమారు 3.60 లక్షల మంది ఓపెన్ ప్లాట్లను క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోగా, ఇందులో 1.16 లక్షల దరఖాస్తులను పరిశీలించారు. వీటిలో 80వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్లోనే ఉన్నాయి. వీటితోపాటు మరో 75 వేల దరఖాస్తులను షార్ట్ ఫాల్స్ చూపుతూ కొర్రీలు పెట్టారు. ప్రిలిమినరీ ఎలిమినేషన్ ప్రక్రియ ముగియగా.. ఫీజులు చెల్లించిన దరఖాస్తులను పరిశీలించి షార్ట్ ఫాల్స్ పేర్కొంటూ దరఖాస్తుదారులకు సమాచారం ఇస్తున్నారు. ఈ క్రమంలో ఉన్న ఫలంగా నిర్ణీత గడువుతో దరఖాస్తులను పరిష్కరించాలని ప్రభు త్వం ఆదేశించడంతో అధికారులు అయోమయానికి గురవుతున్నారు. దీంతో ఏండ్ల తరబడిగా పెండింగ్లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వేగంగా పరిష్కారించడం అనివార్యంగా మారిం ది. ఇదంతా హెచ్ఎండీఏ సిబ్బందికి పనిభారం పెంచనుండగా, అసలే వేధిస్తున్న సిబ్బంది కొరతతో మరింత జాప్యం జరిగే అవకాశమూ ఉన్నది.