ఆదివారం 17 జనవరి 2021
Hyderabad - Dec 02, 2020 , 06:42:45

వారిలో ఉత్తేజం.. వీరిలో నిస్తేజం

వారిలో ఉత్తేజం.. వీరిలో నిస్తేజం

  • గ్రేటర్‌ ఎన్నికల్లో చతికిలపడిన యువ ఓటర్లు
  • వృద్ధులే ఓటేసేందుకు ముందుకు.. 
  • ఇబ్బందులు పడుతూ పోలింగ్‌ కేంద్రాలకు..
  • ఓటు స్ఫూర్తిని మరుస్తున్న నవతరం 
  • గ్రేటర్‌ ఎన్నికల్లో ఆదర్శంగా నిలిచిన వృద్ధులు

సిటీబ్యూరో,నమస్తేతెలంగాణ : బుల్లెట్‌ కంటే బ్యాలెట్‌ బలమైనది..ఓటే నీ ఆయుధం..ఇలా ఎంత మొత్తుకున్నా గ్రేటర్‌ ఓటర్లు ముందుకు కదల్లేదు. ప్రధానంగా యువ ఓటర్లు నిస్తేజమయ్యారు. గ్రేటర్‌ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికి చక్కగా అందివచ్చిన ఓటు హక్కును వినియోగించుకోకుండా ఆదర్శానికి దూరంగా ఉండిపోయారు. వృద్ధ్యాప్యం మీదపడినా, ఎన్నో ఆరోగ్య సమస్యలు..భవిష్యత్తుపై పెద్దగా ఆశలు కూడా లేని వయోవృద్ధులు మాత్రం ఓటు హక్కును మరువలేదు. చలిని సైతం లెక్క చేయకుండా ఉదయమే పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చారు. ఓటు హక్కును వినియోగించుకొని ఆదర్శంగా నిలిచారు. గ్రేటర్‌ ఎన్నికల్లో తమ ఓటు వేసే బాధ్యత ఉన్న యువతను బాధ్యతారాహిత్యమనేలా చేశారు. గ్రేటర్‌ ఎన్నికల పోరులో పేలవమైన పోలింగ్‌ శాతం కలవరపరుస్తున్న సమయంలో వయోవృద్ధులు శ్రమకోర్చి పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి ఓటింగ్‌లో పాల్గొన్నారు.

 సామాజిక మాధ్యమాల్లో వాళ్లను ప్రశంసిస్తూ పలువురు ప్రముఖులు పోస్ట్‌లు పెడుతుండటం విశేషం. ‘80 ఏండ్ల ఓ వృద్ధురాలు తన ఓటు హక్కును వినియోగించుకుంది. ఈ విషయాన్ని తన మనువరాలు, లాక్‌డౌన్‌ తర్వాత మొదటిసారిగా ఓటు వేయడానికి అమ్మమ్మ బయటకొచ్చిందని’ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఈ విషయంపై స్పందించిన మంత్రి కేటీఆర్‌ ‘అమ్మమ్మకు చాలా థ్యాంక్స్‌' అంటూ రిైప్లె ఇచ్చారు. ఫిర్యాదులు తప్ప బయటకు వచ్చి ఓటు వేయడానికి ప్రయత్నించని వారందరికీ ఆమె స్ఫూర్తిదాయకమని ట్వీట్‌ చేశారు. ఇంకో డివిజన్‌లో 95 ఏండ్ల వయో వృద్ధురాలు ఓటు వేయగా, ఆమె మనవడు సాయి రాఘవ ట్వీట్‌ చేశారు. మరోచోట దివ్యాంగుడు ఒంటి కాలుతో నడుచుకుంటూ పోలింగ్‌ స్టేషన్‌కు వచ్చి ఓటెయ్యడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఓటు హక్కును వినియోగించుకోవడానికి కష్టాలను సైతం పక్కకుబెట్టి తన బాధ్యతను నిర్వర్తించడంతో నెటిజన్లు ప్రశంసించారు. 

మూడునెలలు కదల్లేకుండా ఉండి..

కరోనా కారణంగా 3 నెలలు కదల్లేకుండా ఉన్నప్పటికీ చీఫ్‌ ఎన్విరాన్మెంట్‌ సైంటిస్ట్‌ రవీందర్‌ అమీర్‌పేట పోలింగ్‌ కేంద్రానికి వీల్‌ చైర్‌లో వచ్చి ఓటు వేయడం దాని ప్రాముఖ్యత అర్థమయ్యేలా చేసింది. మరోచోట నడువలేని స్థితిలో ఉన్న వృద్ధురాలు ఓటింగ్‌లో పాల్గొన్నారు. ‘టీఆర్‌ఎస్‌ పనితనం బాగుందని ఎప్పుడూ ఓటు వేయని తమ అత్తగారు ఈసారి ఓటింగ్‌లో పాల్గొన్నారని’ ఓ మహిళ ట్వీట్‌ చేశారు. నడిచేందుకు ఇబ్బందిపడుతున్న ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు భార్యతో కలిసి ఓటు వేయడం ప్రశంసాకరం. అంత వయస్సులో కూడా దంపతులు ఓటింగ్‌లో పాల్గొనడం వారి చైతన్యానికి నిదర్శనం. ఇలా గ్రేటర్‌ ఎన్నికల్లో చాలామంది వృద్ధులు, దివ్యాంగులు తమ ఓటు హక్కు వినియోగించుకుని శభాష్‌ అనిపించుకున్నారు. 

సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి-హైదరాబాద్‌,నమస్తేతెలంగాణ : గ్రేటర్‌ ఓటర్లు నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. ఓటు పదును గుర్తించడం లేదు..పోలింగ్‌ రోజును సెలవుదినంగా భావిస్తున్నారు. ఒకసారి కాదు...రెండుసార్లు కాదు..బ్యాలెట్‌ పోరు జరిగిన ప్రతిసారీ గ్రేటర్‌ ఓటర్లు నిర్లిప్తతను ప్రదర్శించారు. గ్రేటర్‌ ఎన్నికల చరిత్రలోనే మంగళవారం అత్యల్ప పోలింగ్‌ శాతం నమోదైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మొదలు నేటిదాకా హైదరాబాద్‌ జనాభా దినదినాభివృద్ధి చెందుతున్నా...ప్రజాస్వామ్య స్ఫూర్తి విషయంలో మాత్రం వెనుకంజ వేస్తున్నది. ఏ ఎన్నికలు జరిగినా గ్రామీణ, ఇతర పట్టణ ప్రాంతాల కంటే తక్కువ పోలింగ్‌ శాతాన్ని నమోదు చేయడాన్ని అలవాటుగా మార్చుకున్న నగర ఓటరు..కాలక్రమేణా పోలింగ్‌ రోజును ఎంజాయ్‌డేగా మార్చుకుంటున్నాడు.

 దాని ఫలితమే అత్యల్ప ఓటింగ్‌ శాతం నమోదు కావడం. గ్రేటర్‌ పరిధిలోని 150 వార్డుల్లో 74,67,256 మంది ఓటర్లు ఉండగా, ఓటు హక్కు వినియోగించుకున్న వారు కేవలం 37.50 శాతం మంది మాత్రమే. అంటే 46.67 లక్షల మందికిపైగా ఓటర్లు తమ బాధ్యతను నిర్వర్తించలేదన్నమాట. 2002 బల్దియా ఎన్నికల్లో 41.04 శాతం పోలింగ్‌ నమోదు కాగా..ఆపై జరిగిన ఎన్నికల్లో క్రమంగా పోలింగ్‌ శాతం పెరుగుతూ వచ్చింది. కానీ తాజా ఎన్నికల్లో నగర ఓటరు పట్టనట్లు వ్యవహరించడం కలచివేస్తుంది. 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 45.27 శాతం నమోదు కాగా, ఇప్పుడు దాదాపు 7.77 శాతం తక్కువ నమోదు కావడమనేది అందరినీ విస్మయానికి గురిచేసింది. 

ప్రజాస్వామ్యంపై విలువ లేకుండా పోయింది..

నగర ఓటరుకు ప్రజాస్వామ్యంపై విలువ లేకుండా పోయింది. ఎన్నికల రోజును వారికి అనుకూలంగా, సౌకర్యవంతంగా కల్పించినప్పటికీ ఓటేస్తే.. నాకేంటి? అన్న ధోరణితో ఇంటికే పరిమితమయ్యారు. నగరవాసికి సమాజ బాగోగులపై పెద్దగా పట్టింపు ఉన్నట్టు కన్పించడం లేదు. సమాజం ఏమైపోతే నాకేంది? నేను బాగున్నా..అంతే చాలు అన్న కోణంలో ఓటింగ్‌ దూరమయ్యారు. నగరంలో కరోనా ప్రబలడం కూడా ఓటింగ్‌ శాతం తగ్గడానికి ఒక కారణమే. ఇంకా స్థానిక నాయకుల పట్ల అసంతృప్తి కూడా ఓటర్లను పోలింగ్‌ వద్దకు రాకుండా చేసింది. నగర ఓటర్లు చాలావరకు ఉదాసీనతకు గురైన్రు. రాజకీయాల్లోకి మతం, కులం, ప్రాంతం, తదితరాంశాలను తీసుకురావడంతో ప్రజాస్వామ్యంపై ఓటర్లలో విలువలు సన్నగిల్లాయి.  - గోరటి వెంకన్న, ప్రజాకవి, గాయకులు,ఎమ్మెల్సీ   

నగరవాసుల్లో అసంతృప్తి..

గ్రామీణ ప్రాంతాల్లో ఓటుకు ముందుకొస్తారు. గ్రామీణులు స్థానిక నాయకులకు లొంగి ఉంటారు. పట్టణాలలో అసంతృప్తి అధికం. ఎన్నికలపై, ఓటింగ్‌పై ప్రజలకున్న చైతన్యం రాజకీయ నేతలకు లేకుండాపోతోంది. పాలనా విషయాలకు వస్తే ఆర్థిక వనరులన్నీ కూడా పెట్టుబడిదారుల చేతుల్లోనే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో తాము ఓటేస్తేంది.. వేయకుంటే ఏముంది? అన్న ధోరణిలో నగరవాసులు ఉంటున్నారు. ఓటింగ్‌లో పాల్గొనకపోవడానికి ప్రధాన కారణం స్థానిక నాయకులపై అసంతృప్తే. కులం,మతం,వర్గాల పేరుతో రాజకీయాలు పక్కదారి పడుతున్నాయి.  - డాక్టర్‌ నాళేశ్వరం శంకరం, ప్రముఖ సాహితీవేత్త 

నగరం విడిచిన ఓటర్లు

కరోనా నేపథ్యంలో నాలుగైదు నెలలపాటు ఉపాధిలేక, వ్యాపారాలు నడవక లక్షలాది మంది ఇబ్బందిపడ్డారు. ఇదే క్రమంలో చాలామంది ఉపాధి కోల్పోయారు. దీంతో ఓటర్ల జాబితాలో ఉన్న వారు చాలామంది నగరాన్ని విడిచిన వారిలో ఉన్నారు. ఉదాహరణకు..అమీర్‌పేట పరిధిలో దాదాపు 1500కు పైగా హాస్టళ్లు ఉన్నాయి. వీటిపై ఆధారపడిన నిర్వాహకులు, వారి కుటుంబాలు, ఇతరత్రా పని చేసేవాళ్లంతా నగరాన్ని విడిచిపోయారు. వివిధ రంగాల్లోనూ ఇదే పరిస్థితి.  

కరోనా కారణమేనా?!

పోలింగ్‌ శాతం తక్కువ నమోదు కావడంలో కరోనా భయం కూడా ఉందని పలువురు చెబుతున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం వైరస్‌ విస్తరించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. శానిటైజేషన్‌ మొదలు ప్రతీ దశలోనే జాగ్రత్తలు చేపట్టింది. మాస్కు ఉంటేనే అనుమతించారు. ఇన్ని రకాల చర్యలు తీసుకున్నా పోలింగ్‌ కేంద్రాల వైపు రాలేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. 

గత నిర్లక్ష్యమే కొనసాగింపు...

వివిధ రకాల కారణాలున్నా..ప్రతిసారీ నగర ఓటరు ప్రదర్శించే నిర్లక్ష్యమే ఈసారి కొనసాగిందనేది నిర్వివాదాంశం. ప్రతి ఎన్నికల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ శాతం పోలింగ్‌ నమోదైతే... ఇక్కడ మాత్రం తక్కువగా ఉంటోంది. దానికి కొనసాగింపుగానే ఈసారి తక్కువ పోలింగ్‌ నమోదైంది. పోలింగ్‌ ప్రక్రియలో పాల్గొన్నవారిలో విద్యావంతులు ఉన్నప్పటికీ..వారికి దీటుగా నిరక్షరాస్యులు కూడా ఉన్నారు. ఇందుకు ఉదాహరణ బస్తీల్లో బారులు తీరడమే. ప్రధానంగా మహిళలు ముందుండి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వృద్ధులు, అనారోగ్యంగా ఉన్నవారు సైతం వీల్‌చైర్‌లలో వచ్చి ఓటేశారు.