బంజారాహిల్స్, జూన్ 3: ‘మా అన్నకు చెప్పకుండా రోడ్డు వేయడం ఏందిరాబై.. పనులు ఆపేయ్..’ అంటూ అధికార పార్టీ నేతలు హూంకరింపులతో అభివృద్ధి పనులు ఆగిపోయాయి. ఏడాదినుంచి రోడ్డు కోసం చెప్పులరిగేలా తిరగితే పట్టించుకోని అన్న ఇప్పుడు ఎందుకు అడ్డుపడతాడంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్‌లోని జ్ఞానీజైల్సింగ్నగర్ బస్తీలో ఏడాదినుంచి రోడ్డంతా గుంతలు పడి నడవడానికి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
పలుమార్లు వాహనదారులు గతుకుల రోడ్లపై కిందపడిపోయి ప్రమాదాలకు గురవుతున్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పనులు మాత్రం ప్రారంభం కాలేదు. దీంతో ఇటీవల జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేశ్ జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులను కలిసి పరిస్థితిని వివరించారు. స్పందించిన అధికారులు రూ.19.50లక్షల నిధులను మంజూరు చేశారు. దీంతో గత నెల 30న కార్పొరేటర్ పనులు ప్రారంభించారు. దీంతో రెండ్రోజుల పాటు ప్రస్తుతం ఉన్న రోడ్డును తొలగించే పనులు సగం పూర్తయ్యాయి.
అయితే ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సమాచారం లేకుండా పనులు ఎలా ప్రారంభిస్తారంటూ కొంతమంది అధికార పార్టీ నేతలు కొర్రీలు పెట్టారు. ఎమ్మెల్యే పనులు ఆపేయమన్నారంటూ అధికారులకు హుకుం జారీ చేశారు. రెండ్రోజులుగా పనులు నిలిచిపోయాయి. వర్షాలు వచ్చేలోగా రోడ్డుపనులు పూర్తవుతాయని ఆశలు పెట్టుకున్న స్థానికులు అధికారపార్టీ నేతల నిర్వాకంపై మండిపడుతున్నారు.
ఎమ్మెల్యేను నిలదీసిన కార్పొరేటర్..
రోడ్డు పనులను ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆపేయించారంటూ వార్తలు రావడంతో మంగళవారం కార్పొరేటర్ వెల్దండ వెంకటేశ్ బస్తీలో పర్యటించారు. ‘అభివృద్ధి పనుల కోసం నిధులు తేవడంలో నిర్లక్ష్యం చేస్తున్న మీరు జరుగుతున్న పనులు ఎలా ఆపుతారంటూ..’ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు ఫోన్ చేసిన కార్పొరేటర్ వెంకటేశ్ నిలదీశారు. తనకు సమాచారం లేదని, తాను ఈ వ్యవహారంపై సమగ్ర సమాచారం తీసుకుంటానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎమ్మెల్యే పేరుతో కొంతమంది లీడర్లు ఇలాంటి పనులు చేస్తున్నారని. వారిపై చర్యలు తీసుకుని అభివృద్ధి పనులను వేగంగా పూర్తిచేయాలని కొర్పొరేటర్ కోరారు.