కాచిగూడ, ఆగస్టు 12: తెలంగాణలో త్వరలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని, లేనియెడల రాష్ట్రం అగ్ని గుండంగా మారుతుందని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. బీసీ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, కార్యదర్శి శ్రావణి, నందగోపాల్ ఆధ్వర్యంలో మంగళవారం కాచిగూడలోని అభినందన్ హోటల్లో జాతీయ బీసీ సదస్సు నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా ఆర్.కృష్ణయ్య హాజరై మాట్లాడుతూ.. రిజర్వేషన్ల సాధన కార్యాచరణకై ఈనెల 31వ తేదీన రవీంద్రభారతిలో నిర్వహించే యుద్ధభేరి మహాసభకు బీసీలంతా రాజకీయాలకు అతీతంగా హాజరుకావాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 D6 రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి సంపూర్ణ అధికారం ఉన్నప్పటికీ సీఎం రేవంత్‌రెడ్డి బీసీ రిజర్వేషన్లపై డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నాడని ధ్వజమెత్తారు.
గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీసీ నినాదం బలంగా ఉందని, రానున్న కాలం బీసీల రాజ్యమేనని వెల్లడించారు. కార్యక్రమంలో వేముల రామకృష్ణ, నీలం వెంకటేశ్, పి.సుధాకర్, జిల్లపల్లి అంజీ, వంశీ, కరుణ, కవిత, సతీశ్, హరి, మణికంఠ, బాలయ్య, శివతోపాటు మేధావులు, అఖిల పక్ష ప్రజాప్రతినిధులు, ఉద్యోగ, న్యాయవాదులు, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.