ఖైరతాబాద్, మార్చి 25 : నిమ్స్ వైద్యశాల డైరెక్టర్ పదవి కోసం భారీ స్థాయిలో లాబీయింగ్ జరుగుతున్నట్లు తెలిసింది. ఈ హాట్ సీట్ కోసం ఇప్పటికే అనేక మంది ఆశావాహులు ఎదురుచూస్తున్నట్లు తెలుస్తున్నది. దేశంలోనే ప్రముఖ వైద్య కళాశాలల్లో నిమ్స్‌కు ప్రత్యేకత స్థానం ఉంది. పేదలకు నాణ్యమైన కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు ఇక్కడ ఉచితంగా అందుతున్నది. ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్, ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ వంటి పథకాలు ఇక్కడ విజయవంతంగా అమలవుతున్నాయి.
ఆధునిక చికిత్స విధానాలు సైతం అందుబాటులో ఉన్నాయి. దీంతో ఆస్పత్రికి వచ్చే రోగుల్లో 99 శాతం పేద రోగులే ఉంటారు. నిత్యం 4వేల మందికి పైగా రోగులు వివిధ చికిత్సల కోసం వస్తున్నారని ఆస్పతి వర్గాలే తెలిపాయి. ఇంతటి ప్రతిష్టాత్మకమైన వైద్యశాల డైరెక్టర్ పదవి కోసం ఈసారి పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది. రాజకీయ వర్గాల్లో కూడా ఈ నియామకం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత డైరెక్టర్ పదవీ కాలం రెండు, మూడు నెలల్లో ముగుస్తుండడంతో ఆ కూర్చీ కోసం సీనియర్ వైద్యులు తమ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తున్నది. సంబంధిత శాఖ అమాత్యుని కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకునేలా ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు అధికార వర్గాల సమాచారం.
ఈ క్రమంలో నిమ్స్ అంతర్గత వాతావరణం కూడా రాజకీయ వర్ణం సంతరించుకున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుత డైరెక్టర్ విషయానికి వస్తే పరిపాలన పరంగా పూర్తిగా ఫెయిలయ్యారంటూ.. పలువురు వైద్యులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. గడిచిన రెండు సంవత్సరాలుగా నిమ్స్ ప్రతిష్టకు మచ్చతెచ్చేలా ప్రయత్నిస్తున్న ఓ వైద్యాధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, కాంట్రాక్ట్ కార్మికులు, నాలుగో తరగతి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోవడం, ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ, పార్కింగ్, ఇతర కాంట్రాక్ట్‌ల్లో జరిగిన అవినీతి అక్రమాలు వెలుగుచూడడంతో పాటు అనేక సమస్యలు ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి సైతం వెళ్లాయి. ఈ నేపథ్యంలో డైరెక్టర్ పదవిని పొడగిస్తారా లేక ఎవరైనా నిజాయతీపరుడైన సమర్థుడికి ఇస్తారా అనేది వేచి చూడాల్సిందే.