సిటీబ్యూరో: బార్ పక్కన స్కూల్ ఎలా నడుస్తుందని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన జిల్లా విద్యాశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ స్కూల్‌పై పూర్తి నివేదిక సమర్పించాలని డీఈవో ఆదేశాలు జారీ చేశారు. ‘అదిగో బార్.. ఇదిగో స్కూల్” అంటూ ‘నమస్తే’లో ఈనెల 17న ప్రత్యేక కథనానికి కలెక్టర్ స్పందించారు. కలెక్టర్ ఆదేశాలతో ప్రత్యేక అధికారులు సీతాఫల్మండిలో నిబంధనలకు విరుద్ధంగా వెలిసిన ఎస్ఎంఎస్ స్కూల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.
ఆ స్కూల్‌కు విద్యా శాఖ నుంచి ఎలాంటి అనుమతి లేదని అధికారులు రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు కూడా లేకుండా ఆ భవనం నిర్మించారని.. పాఠశాల కొనసాగింపు ప్రమాదకరమని అందులో పొందుపరిచారు. ఆ స్కూల్ భవనం ఆనుకుని బార్ ఉన్నదని, అందులో ఉదయం 7 గంటల నుంచే మద్యం సరఫరా, తాగుబోతుల వీరంగం వంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. ప్రధాన రోడ్డు పక్కనే నిబంధనలకు విరుద్ధంగా ఉన్న స్కూల్‌పై విద్యాశాఖ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ రిపోర్ట్‌ను డీఈవో కలెక్టర్‌కు పంపించినట్టు తెలిసింది.