నాంపల్లి క్రిమినల్ కోర్టులు, జులై 17 (నమస్తే తెలంగాణ) : ఓ వ్యక్తిని హత్యచేసిన కేసులో నిందితుడు సంపత్‌కుమార్ అలియాస్ సంపత్ (25)కు జీవిత ఖైదు విధిస్తూ నాంపల్లి కోర్టు జిల్లా జడ్జి బి.సురేష్ గురువారం తీర్పు వెల్లడించారు. కుల్సుంపురా పోలీసు స్టేషన్ పరిధిలో 2020లో మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసు అధికారులు విచారణ చేపట్టారు. సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసిన అనంతరం విచారణాధికారి శంకర్ ఆధ్వర్యంలో కోర్టుకు చార్జీషీట్ దాఖలు చేశారు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామ్‌రెడ్డి కథనం ప్రకారం ఆటోకోసం రోడ్డు ప్రక్కన నిలిచిన వ్యక్తి దగ్గరకు వెళ్లి నిందితుడు మాట్లాడుతూ ఆ వ్యక్తికి కల్లు తాగించి మత్తులోకి జారుకున్న సమయంలో ఆ వ్యక్తి జేబులోంచి డబ్బులు దోచేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో సదరు వ్యక్తి మెల్కోని తేరుకున్నాడు. బూతు మాటలతో సదరు వ్యక్తి నిందితుడిని తిట్టాడనే కోపంతో కర్రతో దాడికి పాల్పడడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సీసీ ఫుటేజుల ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు అరెస్టు చేసి నేరాంగీర పత్రాన్ని నమోదు చేశారు. సుధీర్ఘ విచారణ చేపట్టిన కోర్టు సాక్షుల వాంగ్మూలాల ప్రకారం నిందితుడు హత్య చేసినట్టు రుజువు కావడంతో శిక్షను ఖరారు చేసింది. ఈ కేసులో ఇన్స్పెక్టర్ సునిల్, పి.వీరాంజనేయులు, సిహచ్.శ్రీశైలం కేసు విచారణకు సహకరించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా రెండు నెలలపాటు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పులో పేర్కొంది. నిందితుడిని అధికారులు చంచల్గూడా జైలుకు తరలించారు.