సిటీబ్యూరో, జూలై 25 (నమస్తే తెలంగాణ): భారీ వర్షాలకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్ల పరిధిలో పనిచేసే అధికారులకు, సిబ్బందికి అత్యవసరం అయితే తప్ప సెలవులు ఇవ్వవద్దని మేయర్ ఆదేశాలు జారీ చేశారు. రాబోయే రెండు రోజుల పాటు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో నగరంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం సర్కిల్లో పనిచేస్తున్న కార్యనిర్వాహక ఇంజినీర్లతో వైర్లెస్ సెట్ల ద్వారా మేయర్ సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల్లో నివాసితులు ఎలాంటి ఇబ్బంది లేకుండా నీరు నిలువకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు 428 ఏర్పాటు చేసిన నేపథ్యంలో రోడ్లపై నిలిచిన నీటిని వెనువెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. భారీ వర్షాలు ఉన్నందున అత్యవసర పనులు ఉంటేనే బయటకు రావాలని నగర వాసులకు సూచించారు. సహాయక చర్యల కోసం 040-2111 1111 లేదా.. 9000113667 కు సమాచారం ఇవ్వాలని కోరారు. శిథిలావస్థలో ఉన్న గృహాలపై ఎక్కువగా దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.
విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మాన్సూన్ ఎమర్జెన్సీ, డీఆర్ఎఫ్ సిబ్బందితో వెను వెంటనే సమస్యలకు పరిష్కారం చూపుతున్నది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పలువురు జీహెచ్ఎంసీ గ్రీవెన్స్‌సెల్‌కు ఫిర్యాదులు చేశారు. రంగంలోకి దిగిన డీఆర్ఎఫ్ ప్రత్యేక బృందాలు 31 ప్రాంతాల్లోని ఫిర్యాదులను పరిష్కరించారు. 23 చోట్ల చెట్ల కొమ్మలు విరిగి పడగా.. ఒక చోట అగ్ని ప్రమాదం, ఐదు చోట్ల వరద నీరు నిలువగా నీటిని క్లియర్ చేశారు. రెండు చోట్ల గోడలు కూలినట్లు అధికారులు తెలిపారు. పౌరులు అందించే ఫిర్యాదుల పరిష్కారంలో డీఆర్ఎఫ్ అప్రమత్తంగా ఉండి చర్యలు చేపడుతుందని ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి వెల్లడించారు.