సిటీబ్యూరో, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : భారత రాష్ట్ర సమితిలోకి వలసల పర్వం కొనసాగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులవుతూ…వివిధ పార్టీల నేతలు, యువత భారీగా బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా బోరబండలో కాంగ్రెస్ నేత షేక్ షరీఫ్‌తో పాటు 200 మంది ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరగా, అంబర్‌పేట డివిజన్ పటేల్‌నగర్‌లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆధ్వర్యంలో పలు యువజన సంఘాలకు చెందిన వంద మంది గులాబీ కండువా కప్పుకున్నారు.
కారెక్కిన కాంగ్రెస్ నేతలు గులాబీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే గోపీనాథ్ బోరబండ.. అభివృద్ధిలో బంగారు బండగా మారిందని బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. సోమవారం బోరబండ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసిన షేక్ షరీఫ్ మరో 200 మంది నాయకులు, కార్యకర్తలతో కలిసి బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే మాగంటి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బోరబండ బస్ టెర్మినల్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన సభలో గోపీనాథ్ మాట్లాడుతూ ప్రసంగించారు. హైటెక్ సిటీకి ధీటుగా అభివృద్ధిలో బోరబండ దూసుకుపోతున్నదని పేర్కొన్నారు. కనీస సౌకర్యాలు లేని బోరబండను గత 8 ఏండ్లుగా బంగారు బండగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. అన్ని కులమతాలతో మినీ ఇండియాను తలపిస్తున్న ఈ ప్రాంతంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని అన్నారు. బండి సంజయ్, రేవంత్ మతి భ్రమించి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. అనంతరం షేక్ షరీఫ్ మాట్లాడుతూ బోరబండను అభివృద్ధి పథంలో నడుపుతున్న ఎమ్మెల్యే గోపీనాథ్ పనితీరు నచ్చి బీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు. పార్టీలో చేరిన వారిలో సల్మాన్, హజీ, ఇర్ఫాన్, సాయి, అర్జున్, నరేశ్, దినేశ్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్, విజయకుమార్, కోఆర్డినేటర్ విజయసింహ, ఇన్చార్జి సయ్యద్సిరాజ్, పాల్గొన్నారు.